Share News

మధురవాడలో యూజీడీ

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:30 AM

శరవేగంగా విస్తరిస్తున్న మధురవాడ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) సదుపాయం కల్పించేందుకు జీవీఎంసీ టెండర్‌ పిలిచింది.

మధురవాడలో యూజీడీ

రూ.648.21 కోట్లతో ఏర్పాటు

టెండర్లు పిలిచిన జీవీఎంసీ

21,800 ఇళ్లకు భూగర్భ డ్రైనేజీ కనెక్షన్‌

కాపులుప్పాడ వద్ద ఎస్‌టీపీ ప్లాంట్‌ నిర్మాణం

విశాఖపట్నం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):

శరవేగంగా విస్తరిస్తున్న మధురవాడ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) సదుపాయం కల్పించేందుకు జీవీఎంసీ టెండర్‌ పిలిచింది. బిడ్‌ల దాఖలుకు వచ్చే నెల ఆరో తేదీ వరకు గడువు ఇచ్చింది.

మధురవాడ ప్రాంతంలో యూజీడీ సదుపాయం లేకపోవడంతో పారిశుధ్యపరంగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 40 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించి ఉన్న నాలుగు వార్డులకు యూజీడీ సదుపాయం కల్పించేందుకు రూ.648.21 కోట్ల అంచనాతో జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రపంచబ్యాంకుకు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) రూ.486.16 కోట్లు రుణంగా సమకూర్చేందుకు ముందుకొచ్చింది. ఆ మొత్తాన్ని పదమూడేళ్లలో తిరిగి చెల్లించేలా జీవీఎంసీ ఒప్పందం చేసుకుంది. మిగిలిన 25 శాతం మొత్తాన్ని అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ ద్వారా కేంద్రం నుంచి పొందాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు.

మధురవాడ ప్రాంతంలో 21,800 ఇళ్లకు యూజీడీ కనెక్షన్‌ ఇవ్వాలంటే 450 కిలోమీటర్లు మేర పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ వేయాల్సి ఉంటుందని, రెండుచోట్ల పంప్‌హౌస్‌లు నిర్మించి, కాపులుప్పాడలో 20 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఎస్‌టీపీ (సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) నిర్మించాలని అధికారులు అంచనాలు తయారుచేశారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతోపాటు ఆస్తి పన్ను, యూజీడీ యూజర్‌ చార్జీల ద్వారా వచ్చే మొత్తంతో రుణం తీర్చాల్సి ఉంటుందని అఽధికారులు నివేదికలో పేర్కొన్నారు. నిధులు సమకూర్చేందుకు మార్గం సుగమం కావడంతో ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తిచేసేలా షరతు విధిస్తూ టెండరు పిలిచారు. ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లు, సంస్థలు బిడ్‌ దాఖలుకు వచ్చే నెల ఆరో తేదీ వరకూ అవకాశం కల్పించారు.

Updated Date - Feb 22 , 2026 | 01:30 AM