ఊబర్, ఓలా, ర్యాపిడో డ్రైవర్ల బంద్
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:53 AM
నగరంలో ఊబర్, ర్యాపిడో, ఓలా కారు డ్రైవర్లు చేస్తున్న సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరింది.
విమానాశ్రయం నుంచి నగరానికి పాకిన సమ్మె
ప్రయాణికుల ఇక్కట్లు
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఊబర్, ర్యాపిడో, ఓలా కారు డ్రైవర్లు చేస్తున్న సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరింది. గత మూడు రోజుల సమ్మె విమానాశ్రయానికే పరిమితం కాగా శనివారం ఇది నగరంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పాకింది. క్యాబ్ సర్వీసులకు తగ్గించిన రేట్లు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో డ్రైవర్లు సమ్మెకు దిగారు. గతంలో అంటే 2022లో మంచి రేట్లు ఉండేవని, పెట్రోల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో వాటిని పెంచాల్సింది పోయి తగ్గించేశారని వారు ఆరోపిస్తున్నారు. సంస్థలు అమలు చేస్తున్న రాడార్ విధానం వల్ల నష్టపోతున్నామని, దానిని రద్దు చేయాలని కోరుతున్నారు. విశాఖలో 4,500 మంది క్యాబ్ డ్రైవర్లు ఉండగా పై సంస్థల్లో ఒక్క కార్యాలయం కూడా విశాఖలో లేదని, కనీసం సమాధానం చెప్పే దిక్కులేదని ఆరోపిస్తున్నారు.
ప్రయాణికుల ఇక్కట్లు
ఊబర్, ఓలా, రాపిడోలో క్యాబ్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. విశాఖ నుంచి విజయనగరం వెళ్లడానికి గతంలో రూ.2 వేలు తీసుకునేవారు. ఇప్పుడు కేవలం రూ.900 నుంచి వేయి రూపాయలకే క్యాబ్ దొరుకుతోంది. అలాగే అటు నుంచి ఇక్కడికి వచ్చేవారు కూడా అదే రేటుకు వస్తున్నారు. విమానాశ్రయం నుంచి మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీలకు కేవలం రూ.300కు వచ్చేస్తున్నారు. మధురవాడకు రూ.500 వరకు పడుతోంది. అదే టాక్సీలను మాట్లాడుకుంటే ఎవరూ వేయి రూపాయలకు తక్కువ రావడం లేదు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ల సమ్మె వల్ల విమానాశ్రయంలో దిగినవారు ఇళ్లకు వెళ్లడానికి వాహనాలు దొరకడం లేదు. సొంత వాహనం లేదా కంపెనీ డ్రైవర్ వస్తే ఇబ్బంది లేదు. కానీ అద్దెకు టాక్సీ మాట్లాడుకొని వెళ్లాలనుకునేవారికి సమ్మె వల్ల ఇబ్బంది కలుగుతోంది. ఈ సమ్మె ఇప్పుడు నగరం అంతా వ్యాపించింది. ఫోన్‌లో బుక్ చేసుకుంటే రాలేమని చెబుతున్నారు. రెయిడ్ రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రైవేటుగా అయితే వస్తామని, దానికి ఎక్కువ రేటు పడుతుందని అంటున్నారు. దాంతో తప్పనిసరిగా వారు అడిగినంతా ఇచ్చి వెళ్లాల్సి వస్తోంది. మరికొందరు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇంకో రెండు, మూడు వారాల్లో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్య ఉత్పన్నం కావడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.