పశువులను ఢీకొన్న ద్విచక్ర వాహనాలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:55 PM
చింతపల్లి- కృష్ణాదేవిపేట జాతీయ రహదారి రంపుల గ్రామంలో మూడు పశువులను రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.
మూడు పశువులు మృతి
వాహనచోదకులకు స్వల్ప గాయాలు
గూడెంకొత్తవీధి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి- కృష్ణాదేవిపేట జాతీయ రహదారి రంపుల గ్రామంలో మూడు పశువులను రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు పశువులు అక్కడికక్కడే మృతి చెందగా, వాహనచోదకులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గురువారం ఉదయం రంపుల గ్రామానికి చెందిన కంకిపాటి గోవింద్‌కి చెందిన రెండు ఆవులు, కంకిపాటి బాలకృష్ణ పడాల్‌కి చెందిన మరో ఆవు రహదారిపై వెళుతున్నాయి. అదే సమయంలో పెదవలస నుంచి రంపుల వైపు రెండు ద్విచక్ర వాహనాలపై ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు. ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు పశువులను ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే మూడు పశువులు మృతి చెందాయి. స్వల్పంగా గాయపడిన వాహనచోదకులను స్థానికులు పెదవలస పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. కాగా ప్రజలు పశువులను విచ్చలవిడిగా విడిచిపెట్టడం వల్ల రహదారిపై సంచరిస్తున్నాయని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని జీకేవీధి ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.