Share News

సుపరిపాలనకు రెండేళ్లు

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:49 PM

రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వ పాలన జరిగిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

సుపరిపాలనకు రెండేళ్లు
సంఘీభావం తెలుపుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు కొణతాల, బండారు, సుందరపు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పంచకర్ల, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, తదితరులు

అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు..

డబుల్‌ ఇంజన్‌ సర్కారు వల్లే సాధ్యం

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర

ఘనంగా విజయోత్సవ బహిరంగ సభ

కొత్తూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వ పాలన జరిగిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం అనకాపల్లి ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వైసీపీ హయాంలో విధ్వంసకర పాలన సాగగా, కూటమి ప్రభుత్వం వచ్చాక వికాసం వైపు ప్రయాణం సాగించి నేటికి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుందన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుందని తెలిపారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున స్వర్ణాంధ్ర నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గట్టి పునాది వేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, వికాసం బాటలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకువెళుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా ఉందని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలన దక్షత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వెన్నుదన్నుతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, సుందరపు విజయకుమార్‌, పంచకర్ల రమేశ్‌బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, కార్పొరేషన్ల చైర్మన్లు కోట్ని బాలాజీ, మళ్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌, ఆర్డీవో ఆయుషా, ఏఎస్పీ శ్రావణి, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:49 PM