జీవీఎంసీకి రెండు స్వచ్ఛ అవార్డులు
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:52 AM
రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకమైన రెండు అవార్డులకు జీవీఎంసీ ఎంపికైనట్టు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు.
స్వచ్ఛ మునిసిపల్ కార్పొరేషన్లు, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీల్లో ఎంపిక
నేడు విజయవాడలో సీఎం చేతుల మీదుగా ప్రదానం
విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకమైన రెండు అవార్డులకు జీవీఎంసీ ఎంపికైనట్టు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. నగరాల్లో పారిశుధ్యం, శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ, పౌరులకు మెరుగైన జీవన పరిస్థితుల కల్పన వంటి అంశాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే నిర్వహించిందన్నారు. ‘స్వచ్ఛ మునిసిపాలిటీస్’ కేటగిరీతోపాటు ‘స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం’ కేటగిరీలో మూడు లక్షలకు పైబడిన పట్టణ స్థానిక సంస్థల విభాగంలో జీవీఎంసీ అవార్డుకు ఎంపికైనట్టు ఆయన తెలిపారు. అలాగే స్వచ్ఛత వారియర్స్ కేటగిరీలో వెస్ట్ జోన్‌కు చెందిన వై.నాగరాజు రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారని కమిషనర్ వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నామన్నారు. ఇవికాకుండా జిల్లా స్థాయిలోనూ జీవీఎంసీకి పలు కేటగిరీల్లో అవార్డులు లభించాయన్నారు. జిల్లాస్థాయి అవార్డులను వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో అందజేస్తారన్నారు. రాష్ట్రస్థాయిలో జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడం సంతోషంగా ఉందని, దీనికి కారణమైన జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛతా వారియర్స్‌తోపాటు నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
సింహాచలం దేవస్థానం, ద్వారకా బస్ స్టేషన్, చంద్రంపాలెం పాఠశాలకు కూడా...
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలులో ప్రతిభ కనబరిచిన మరికొన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలను అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆలయాల విభాగంలో సింహాచలం దేవస్థానం, స్వచ్ఛ పాఠశాల విభాగంలో చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల, ఆస్పత్రుల విభాగంలో పెందుర్తి సీహెచ్‌సీ, చినముషిడివాడ యూసీహెచ్‌సీ ఎంపికయ్యాయి. ఇంకా స్వచ్ఛ బస్‌స్టేషన్‌ల విభాగంలో ద్వారకా బస్‌స్టేషన్, ప్రభుత్వ సంస్ధల విభాగంలో జీవీఎంసీ, గ్రామ సంస్థల విభాగంలో చిన్నాపురం గ్రామ ఆర్గనైజేషన్, హోటల్స్ విభాగంలో నోవాటెల్ ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయి అవార్డులకు జిల్లా నుంచి పలు సంస్థలు/శాఖలు ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు ముందుకుసాగుతామని తెలిపారు.
కలెక్టరేట్‌లో మరో సమావేశ మందిరం
రూ.5 కోట్లు కేటాయింపు
సీపీఓ కార్యాలయం పక్కన నిర్మాణం
ఆర్టీజీఎస్ భవనం పనులు కూడా పూర్తిచేయాలని నిర్ణయం
విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కొత్తగా సమావేశ మందిరాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం జిల్లా మినరల్ ఫండ్ నుంచి రూ. ఐదు కోట్లు కేటాయించారు. కలెక్టర్ కార్యాలయం మొదటి అంతస్థులో ప్రస్తుతం ఒక సమావేశ మందిరం ఉంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఒకేసారి సమావేశం కావడానికి ప్రస్తుతం ఉన్న హాలు సరిపోవడం లేదు. దీనికితోడు ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ఈ హాలులోనే నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది వస్తే స్థలాభావంతో అనుమతించడం లేదు. దీంతో పోలీసులు, ఫిర్యాదుదారులకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. అర్జీలు సమర్పించే వృద్ధులు, దివ్యాంగులు మేడపైకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఒక్క లిఫ్ట్ మరమ్మతుకు గురైతే మేడపైకి వెళ్లలేక కొందరు మెట్ల దగ్గర ఉన్న అధికారులకు అర్జీలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా సమావేశ మందిరం నిర్మిస్తే అన్ని విధాలా ఉపయోగపడుతుందని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ నిర్ణయించారు. ప్రాంగణంలో పోస్టాఫీస్‌కు అభిముఖంగా సీపీవో కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో కొత్తగా సమావేశ మందిరం నిర్మించాలని ప్రతిపాదించారు. ఇదే స్థలానికి ఆనుకుని 2018లో ఆర్టీజీఎస్ భవనం నిర్మాణం ప్రారంభించారు. వైసీపీ హయాంలో నిలిచిన పనులను కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పునఃప్రారంభించారు. అయితే నిధుల సమస్యతో ప్రస్తుతం పనులు ఆగాయి. ఆర్టీజీఎస్ భవనం కూడా పూర్తిచేయాలని కలెక్టర్ నిర్ణయించారు.
వినియోగంలోకి పాత ట్రెజరీ కార్యాలయం
కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాలుకు ఆనుకుని జిల్లా ఖజానా కార్యాలయం ఉండేది. పూర్తిగా శిథిలం కావడం, వర్షానికి పైకప్పులు పడిపోవడంతో విధుల నిర్వహణకు వీలులేని స్థితికి చేరింది. దీంతో రెండేళ్ల క్రితం రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు ఎదురుగా ఐదు అంతస్థులతో నిర్మించిన ఆర్థిక భవనంలోకి ఖజానా కార్యలయాన్ని తరలించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ భవనానికి మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. మరమ్మతులు అనంతరం ప్రైవేటు భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయానికి కేటాయించాలని యోచించారు.
38 మద్యం దుకాణాలకు 143 దరఖాస్తులు
గడువు ఆరో తేదీ వరకూ పెంపు
విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):
లైసెన్స్ రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 159 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఏడాది కాలానికి లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. అయితే 107 దుకాణాల నిర్వాహకులు మాత్రమే లైసెన్సులను రెన్యువల్ చేసుకున్నారు. మిగిలిన 52 దుకాణాలకు దరఖాస్తులు కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తులు సమర్పించేందుకు గురువారం వరకు గడువు ఇచ్చింది. అయితే కేవలం 38 దుకాణాలకు 143 దరఖాస్తులు రావడంతో గడువును ఈనెల ఆరు వరకు పెంచింది. ఏడున దరఖాస్తుల పరిశీలన చేసి, ఎనిమిదిన జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా దుకాణాలను కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారి ఆర్.ప్రసాద్ తెలిపారు.
16న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి)
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం సవరించినట్టు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. నోటీసుల పరిశీలన, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియకు ఈనెల పదో తేదీ వరకు గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి అనుగుణంగా అక్టోబరు 16వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు.