మరో 2 రైల్వే లైన్లు
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:13 AM
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో బిక్కవోలు నుంచి దువ్వాడ వరకు కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు (మూడు, నాలుగు) అందుబాటులోకి రానున్నాయి.
బిక్కవోలు నుంచి దువ్వాడ వరకూ నిర్మాణం
తుని, అనకాపల్లిలలో శాటిలైట్ స్టేషన్లు
రైళ్లు అన్నింటికి ‘కవచ్’ రక్షణ
రూ.4,299.12 కోట్లతో టెండర్లు ఆహ్వానం
వచ్చే నెలలో ప్రీ బిడ్ సమావేశం
ఫిబ్రవరిలో పనులు అప్పగింత
45 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో బిక్కవోలు నుంచి దువ్వాడ వరకు కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు (మూడు, నాలుగు) అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి జోన్ అధికారులు తాజాగా టెండర్లు ఆహ్వానించారు. ఇందులో భాగంగా తుని, అనకాపల్లిల్లో శాటిలైట్ స్టేషన్లను అభివృద్ధి చేస్తారు.
చెన్నై-హౌరా ప్రధాన రవాణా మార్గంలో నిడదవోలు నుంచి దువ్వాడ వరకు రైల్వే లైన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆమోదం తెలిపింది. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. ఈ మార్గంలో అదనంగా నిర్మించే మూడు, నాలుగు లైన్ల పొడవు సుమారు 151.08 కిలోమీటర్లు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, అండ్ కనస్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో రూ.4,299.12 కోట్లకు టెండర్లు ఆహ్వానించారు. వీటి ప్రీ బిడ్ సమావేశం డిసెంబరులో నిర్వహించి, ఫిబ్రవరిలో టెండర్లు ఖరారు చేస్తారు. అక్కడి నుంచి పనులు దక్కించుకున్న సంస్థ 45 నెలల్లో పనులు పూర్తిచేయాలి. అందులో సివిల్, ఎలక్ట్రికల్, ఓవర్‌హెడ్ ఎలక్ర్టిఫికేషన్, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్ పనులన్నీ ఉంటాయి. ఈ మార్గంలో నడిచే రైళ్లు అన్నింటికీ ‘కవచ్’ రక్షణ సదుపాయం ఏర్పాటుచేస్తారు. అంటే ఒకే మార్గంలో పొరాపాటున ఎదురెదురుగా రైళ్లు వచ్చినప్పుడు అవి ఢీకొనకుండా ‘కవచ్’ వ్యవస్థ ఆ రైళ్లను ఆటోమేటిక్‌గా ఆపేస్తుంది. దీనివల్ల ప్రమాదం తప్పుతుంది. ఈ టెండర్ల పని విశాఖపట్నం, విజయవాడ డివిజన్లలో జరుగుతుంది.
బైపాసింగ్ సదుపాయం
సుమారు రూ.4 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో బిజీ రైల్వే స్టేషన్లను బైపాస్ చేస్తూ ప్రత్యేక అలైన్‌మెంట్ అభివృద్ధి చేస్తారు. అదే ఇందులో కీలక అంశం. తుని, అనకాపల్లి రైల్వే స్టేషన్ల రద్దీ వల్ల ఆపరేషన్లకు ఇబ్బంది ఎదురవుతోంది. అందుకని అన్నవరం యార్డు వద్ద మూడు, నాలుగు లైన్లను అప్పర్ మెయిన్ లైన్‌కు మార్పు చేసి కట్ అండ్ కనెక్షన్ ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల తిమ్మాపురం, హంసవరం, తుని స్టేషన్లు బైపాస్ అవుతాయి. ఈ అలైన్‌మెంట్‌లోనే గుల్లిపాడు స్టేషన్‌కు సుమారు మూడు కి.మీ. ముందు తుని శాటిలైట్ స్టేషన్ అభివృద్ధి చేస్తారు.
ఇదేవిధంగా ఎలమంచిలికి 8 కి.మీ. అవతల నర్సింగపల్లి, బయ్యవరం, కశింకోట, అనకాపల్లి స్టేషన్లను బైపాస్ చేస్తూ కొత్త లైన్లు నిర్మిస్తారు. ఇందులో భాగంగానే అనకాపల్లి శాటిలైట్ స్టేషన్ అభివృద్ధి చేస్తారు. ఈ కొత్త లైన్లు తాడి స్టేషన్‌కు ఒక కిలోమీటర్ ముందు తిరిగి ప్రస్తుత మెయిన్‌లైన్‌లో కలుస్తాయి. ఇవి అలా సమాంతరంగా దువ్వాడ వైపు డౌన్ మెయిన్‌లైన్ వరకు కొనసాగుతాయి. అనకాపల్లిలో కొత్తగా ఏర్పాటుచేసే శాటిలైట్ స్టేషన్‌లో కోచింగ్ మెయింటెనెన్స్ సౌకర్యాలు కల్పిస్తారు. దాంతో పాటు రెండు పిట్ లైన్లు, మరో రెండు స్టేబలింగ్ లైన్లు వేస్తారు. విశాఖపట్నం జంక్షన్‌లో రైళ్ల ఆపరేషన్ లోడ్ తగ్గించడానికి వీలుగా పని విభజనకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా అనకాపల్లి నుంచి కొత్తవలసకు కొత్త బ్రాడ్ గేజ్ లైన్ వేస్తారు.
మరో 29 మిలియన్ టన్నుల రవాణాకు అవకాశం
చెన్నై-హౌరా ప్రధాన మార్గం సామర్థ్య వినియోగం ప్రస్తుతం 130 శాతంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా సరకు రవాణా, ప్రయాణికుల రద్దీ పెరగనుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త లైన్లను నిర్మిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఏడాదికి అదనంగా మరో 29.04 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసుకోవచ్చు.