కేజీహెచ్‌లో మరో 2 ఓపీ కౌంటర్లు
ABN , Publish Date - May 16 , 2026 | 12:42 AM
కేజీహెచ్‌లో మరో రెండు ఓపీ (అవుట్ పేషెంట్) కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ఎనిమిది కౌంటర్లు...
పేరు నమోదు కోసంగంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి
రోగుల ఇబ్బందులను గమనించి కౌంటర్లు పెంచాలని సూచించిన ఎంపీ శ్రీభరత్
అదనంగా కౌంటర్ల ప్రారంభానికి ఆస్పత్రి అధికారుల ఏర్పాట్లు
విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో మరో రెండు ఓపీ (అవుట్ పేషెంట్) కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఎనిమిది ఓపీ కౌంటర్లు ఉన్నాయి. అయితే, రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఓపీ చీటీ తీసుకోవడానికి కనీసం గంటకుపైగా క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. రోగుల ఇబ్బందులను గుర్తించిన ఎంపీ శ్రీభరత్ మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని నాలుగు రోజుల కిందట ఆస్పత్రిని సందర్శించినప్పుడు అధికారులకు సూచించారు. ఎంపీ సూచనతో ఆస్పత్రి అధికారులు అదనంగా మరో రెండు కౌంటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు సమకూర్చారు. ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కేటాయించారు. రెండు రోజుల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపీ కౌంటర్లలో సేవలు ప్రారంభిస్తామని ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్ బీవీ రమణ తెలిపారు.
గణనీయంగా పెరిగిన రోగులు
గతంలో రోజుకు 1,500 నుంచి 1,800 మంది వరకు ఓపీ సేవలు పొందేవారు. అయితే, గడిచిన కొద్ది నెలలుగా ఈ సంఖ్య భారీగా పెరిగింది. ప్రతిరోజూ రెండు వేల మందికిపైగా ఓపీ సేవల కోసం వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 57,949 మంది, ఫిబ్రవరిలో 67,738 మంది, మార్చిలో 69,983 మంది, ఏప్రిల్‌లో 69,010 మంది ఓపీ సేవలు పొందారు. గతంలో నెలవారీ రోగుల సంఖ్య 40 వేలకు మించేది కాదు. కానీ, కొద్ది నెలలుగా రోగుల సంఖ్య భారీగా పెరగడంతో ఉదయం 8 మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ చీటీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్లు పెంచాలని నిర్ణయించినట్టు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.