నర్సీపట్నంలో మరో రెండు కోర్టులు
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:41 AM
నర్సీపట్నంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించనున్నాయి. హైకోర్టు ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు. కొత్తగా మంజూరైన కోర్టుల్లో రెండు నర్సీపట్నంలో ఏర్పాటు కానున్నాయి.
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాల ఏర్పాటు
కోర్టు సముదాయంలో వసతులను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు
నర్సీపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించనున్నాయి. హైకోర్టు ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు. కొత్తగా మంజూరైన కోర్టుల్లో రెండు నర్సీపట్నంలో ఏర్పాటు కానున్నాయి. వీటిలో ఒకటి అదనపు జిల్లా సెషన్స్ జడ్డి కోర్టు కాగా, మరొకటి రెండో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు వున్నాయి. స్థానిక కోర్టు సముదాయంలో అదనంగా రెండు కోర్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన వసతులు, సదుపాయాలను పరిశీలించడానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు శుక్రవారం నర్సీపట్నం వచ్చారు. న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్‌అండ్‌బీ డీఈఈతో మాట్లాడారు. ఇక్కడి కోర్టు సముదాయ భవనాలను పరిశీలించిన అనంతరం.. కొత్తగా మంజూరైన రెండు కోర్టులను నిర్వహించడానికి తాత్కాలిక సదుపాయాలు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. నీటి సదుపాయం కోసం మరో బోరు వేయించడానికి ఆయన భూమి పూజ చేశారు. ప్రస్తుతం నర్సీపట్నం కోర్టు సముదాయంలో సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టు, అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ డివిజన్)తో మొత్తం కోర్టుల సంఖ్య ఏడుకు చేరుతుంది.
రూ.3.9 కోట్లతో అదనపు భవన నిర్మాణం
నర్సీపట్నం కోర్టు సముదాయంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్, మొదటి అంతస్థులో ఆయా కోర్టులను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కోర్టుల నిర్వహణతోపాటు ఇతర అవసరాల నిమిత్తం అదనపు వసతి కోసం రెండో అంతస్థు నిర్మాణానికి ప్రభుత్వం గత ఏడాది రూ.3.9 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల ఆర్థిక శాఖ పరిపాలనా ఆమోదం కూడా తెలిపింది. టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టడమే మిగిలి వుంది.