Share News

ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:46 PM

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ డివిజనల్‌ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు బుధవారం తమ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు.

ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు
లొంగిపోయిన మావోయిస్టులతో ఎస్పీ అమిత్‌ బర్దార్‌

పాడేరు రూరల్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ డివిజనల్‌ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు బుధవారం తమ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. ఆయన పాడేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలిసేందుకు అబూజ్‌మడ్‌ డివిజనల్‌ ఏరియా కమిటీ సభ్యురాలు కడితి హిడ్మే అలియాస్‌ అంజు కరుణ, ఏరియా కమిటీ సభ్యుడు బడ్సే భీమా అలియాస్‌ మనీష్‌లు లొంగిపోయారన్నారు. వారు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారన్నారు. కడితి హిడ్మే 2010లో బాలల సంఘంలో చేరిందన్నారు. 2012లో దళ సభ్యురాలిగా, 2017 నుంచి 2019 వరకు డీవీసీగా డాక్టర్స్‌ టీమ్‌లో, 2020లో ఏరియా కమిటీ మెంబర్‌గా, 2024లో పదోన్నతి పొంది డీసీఎంగా పనిచేసిందన్నారు. భద్రత బలగాలతో మూడుసార్లు ఎదురుకాల్పుల్లో ఆమె పాల్గొన్నదని ఆయన చెప్పారు. అలాగే బడ్సే భీమా 2018లో గ్రామ మిలటరీ మెంబర్‌గా చేరి 2018 నుంచి 2024 వరకూ దళ సభ్యుడిగా, 2024లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడన్నారు. మావోయిస్టు పార్టీ బలహీనపడడం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు, ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో వీరిద్దరూ స్వచ్ఛందంగా లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలను పూర్తిగా వినియోగించుకొని శాంతియుత జీవనం గడపాలని ఆయన కోరారు. ఇతర మావోయిస్టు క్యాడర్లు సమీప పోలీస్‌ స్టేషన్లలో స్వచ్ఛందంగా లేదా కుటుంబ సభ్యుల ద్వారా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 18 , 2026 | 11:46 PM