Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:29 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రాలీని వ్యాన్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఇన్‌చార్జి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ప్రమాదంలో నుజ్జయిన వ్యాన్‌ ముందు భాగం

- మర్రిబంద జంక్షన్‌ హైవేపై ఆగి ఉన్న ట్రాలీని ఢీకొన్న వ్యాన్‌

- మృతులు పల్నాడు జిల్లా వాసులు

ఎలమంచిలి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రాలీని వ్యాన్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఇన్‌చార్జి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామానికి చెందిన చండ్రా రాంబాబు(45), పల్నాడు జిల్లా సావల్యపురం మండలం కనమర్లపూడి గ్రామానికి చెందిన పాశం రాఘవయ్య(40)డ్రైవర్లుగా పని చేస్తున్నారు. రాంబాబు వ్యవసాయం చేసుకుంటూ ఇటీవల వ్యాన్‌ కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నాడు. రాఘవతో కలిసి ఈ నెల 2వ తేదీ రాత్రి పండ్లలోడుతో నరసరావుపేట నుంచి భువనేశ్వర్‌ బయలుదేరారు. శనివారం వేకువజామున ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్‌ వద్దకు వచ్చే సరికి ఆగి ఉన్న ట్రాలీని వీరి వ్యాన్‌ బలంగా ఢీకొంది. దీంతో వ్యాన్‌ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం వల్ల ఈ మార్గంలో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి హైవే పెట్రోలింగ్‌, పోలీసు సిబ్బంది చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మృతదేహాలను అంబులెన్స్‌లో ఎలమంచిలి సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, మృతులు రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాఘవకు తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:29 AM