రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:01 AM
జి.మాడుగుల- మద్దిగరువు రహదారిలో భీరం పంచాయతీ అనర్భ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు..
జి.మాడుగుల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జి.మాడుగుల- మద్దిగరువు రహదారిలో భీరం పంచాయతీ అనర్భ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. కిల్లంకోట పంచాయతీ కె.బందవీధికి చెందిన పొత్తూరి తిరుపతిరావు, ఎండ్రపల్లి మురళి గురువారం జి.మాడుగులకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళుతున్నారు. అనర్భ గ్రామానికి సమీపంలో మద్దిగరువు నుంచి వస్తున్న ప్రైవేటు జీపు ఢీకొన్నది. దీంతో తిరుపతిరావు, మురళి గాయపడ్డారు. స్థానికులు 108కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చింది. క్షతగాత్రులను పాడేరు జిల్లా ఆస్పత్రికితరలించారు.
నాగులాపల్లిలో వివాహిత ఆత్మహత్య
- అదనపు కట్నం కోసం వేధించారంటూ మృతురాలి తండ్రి ఫిర్యాదు
మునగపాక, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నాగులాపల్లి జగనన్న కాలనీలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి గురువారం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన వేగి రాము కుమార్తె సంతోషికుమారికి నాగులాపల్లి గ్రామానికి చెందిన ఆళ్ల ఆదినారాయణతో సుమారు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇటీవల కాలంలో ఆదినారాయణ అదనపు కట్నం కోసం భార్య సంతోషికుమారిని తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె తండ్రి తెలిపారు. వేధింపులు భరించలేకనే తమ కుమార్తె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కాగా అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పలు వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్టు
ఎలమంచిలి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలోని రామ్‌నగర్ కాలనీ టిడ్కో గృహ సముదాయంలో గతేడాది డిసెంబరు 9వ తేదీ రాత్రి ప్రజల్లో భయాందోళన సృష్టిస్తూ పలు వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని గురువారం పట్టణ ఎస్‌ఐ సావిత్రి తెలిపారు. నిందితుడు హైదరాబాద్ బహుదూర్‌పల్లి ప్రాంతానికి చెందిన టి.కార్తీక్‌గా గుర్తించామన్నారు. నిందితుడు ఒక కారు, రెండు ఆటోలు, పలు ద్విచక్రవాహనాల సిగ్నల్ లైట్లను ధ్వంసం చేసినట్టు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
చింతపల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలపరి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. దోమలగొంది గ్రామానికి చెందిన దాసు, పోతురాజు గున్నలు, వంతల జానకమ్మ ద్విచక్రవాహనంపై గురువారం చింతపల్లి వస్తున్నారు. కొలపరి మలుపు వద్ద వాహనం అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయింది. ఈ ఘటనలో దాసు తీవ్రంగా గాయపడగా, జానకమ్మకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రుల అంబులెన్సులో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు.