Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:28 AM

మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు పితమరిగుడ జంక్షన్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
పితమరిగుడ జంక్షన్‌లో ప్రమాద దృశ్యం

మరొకరి పరిస్థితి విషమం

డుంబ్రిగుడ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు పితమరిగుడ జంక్షన్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని స్థానిక ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సాగర పంచాయతీ కుసమగుడ గ్రామానికి చెందిన టి.తేజేశ్వరరావు(20), ఎస్‌.శేషుప్రవీణ్‌(21), వి.అరవింద్‌లు బుధవారం ఉదయం కిల్లోగుడ మీదుగా ఒడిశా రాష్ట్రం చటువాకు బైక్‌పై వెళ్లారు. అక్కడ అల్పాహారం తీసుకుని గ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు. పితమరిగుడ జంక్షన్‌కు వచ్చేసరికి బైక్‌ అదుపుతప్పడంతో అక్కడ ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని ఢీకొన్నారు. దీంతో తేజేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, శేషుప్రవీణ్‌ను అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అరవింద్‌ను పాడేరు ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అతని పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరి మృతి

జి.మాడుగుల: జాతీయ రహదారి 516- ఈ పనులు చేపడుతున్న ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం లింగేరిపుట్టు గ్రామానికి చెందిన పాంగి సిద్ధూ(21) కొన్నేళ్లుగా జాతీయ రహదారి పనుల్లో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం వంజరి పంచాయతీ కేంద్రం సమీపంలో గెడ్డ నుంచి నీళ్లు తీసుకురావడానికి నీళ్ల ట్యాంకర్‌ ఉన్న ట్రాక్టర్‌తో వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ బోల్తా పడడంతో దాని కింద పడి అతను మృతి చెందాడు.

Updated Date - Jun 04 , 2026 | 12:28 AM