రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , Publish Date - May 02 , 2026 | 11:37 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాల్య స్నేహితులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నర్సీపట్నం- కృష్ణాపురం మార్గమధ్యంలో జరిగింది.
ఇరువురూ బాల్య స్నేహితులు
నర్సీపట్నం- కృష్ణాపురం మార్గంలో ఘటన
నర్సీపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాల్య స్నేహితులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నర్సీపట్నం- కృష్ణాపురం మార్గమధ్యంలో జరిగింది. దీనికి సంబంధించి పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నర్సీపట్నం కొత్తవీధికి చెందిన అనపర్తి రామకృష్ణ (30), పెంటకోట అయ్యప్ప (32) బాల్య స్నేహితులు. వీరిద్దరూ శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై కాకినాడ జిల్లా అన్నవరం వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 10.45 గంటల సమయంలో కళ్లెంపూడి జంక్షన్ వద్దకు వచ్చే సరికి అనకాపల్లి నుంచి నర్సీపట్నం మీదుగా కోటనందూరు వెళుతున్న కారు వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం ముందు భాగం దెబ్బతిన్నది. వాహనం నడుపుతున్న పెంటకోట అయ్యప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రామకృష్ణ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన పాయకరావుపేట ఇందిరా కాలనీకి చెందిన కారు డ్రైవర్ ఎస్.వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ గఫూర్ తెలిపారు.
కొత్తవీధిలో విషాద ఛాయలు
అనపర్తి రామకృష్ణ, పెంటకోట అయ్యప్ప మృతి చెందడంతో కొత్తవీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనపర్తి రామకృష్ణకు భార్య రజని, రెండేళ్ల పాప ఉన్నారు. ఒక ప్రైవేటు బ్యాంకులో లోన్ రికవరీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కాగా పెంటకోట అయ్యప్పకు తండ్రి శ్రీను, తల్లి లక్ష్మి ఉన్నారు. అయ్యప్పకు ఇంకా వివాహం కాలేదు. ఆప్టింగ్ కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. కొత్తవీధిలో ఏ కార్యం తలపెట్టినా ఇద్దరూ ముందుండి సేవ చేసేవారని స్థానికులు చెప్పారు.