రెండు బైక్‌లు ఢీ : ఒకరి మృతి..
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:56 PM
అరకులోయకు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
ఇద్దరి పరిస్థితి విషమం
మరొకరికి స్వల్ప గాయాలు
మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలింపు
అరకులోయ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని భీముడువలస-సిర్లమామిడివలస గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చూసిన భీముడువలస గ్రామస్థులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది వచ్చి వారిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించగా డాక్టర్ నిహారిక వారికి వైద్యం అందించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో అరకులోయ మండలం బస్కీ పంచాయతీ కుంటిరంగిణి గ్రామానికి చెందిన పూజారి ధనరాజ్ (22)ని అంబులెన్స్‌లో తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందాడు. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ దిగువ సల్లంగి గ్రామానికి చెందిన రాపా కోటేశ్వరరావు(22), చిట్టం చరణ్(18)తలలకు గాయం కావడం, ముక్కు, చెవి నుంచి రక్తం కారడంతో వారికి ఆక్సిజన్ పెట్టి మెరుగైన వైద్యం కోసం పాడేరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిని పరిశీలించిన వైద్యులు విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అదేవిధంగా అరకులోయ మండలం మాడగడ పంచాయతీ గత్తన్‌గుడ గ్రామానికి చెందిన కిల్లో సాయికి చిన్న గాయాలు తగిలాయని, ఆయన అరకులోయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డాక్టర్ నిహారిక తెలిపారు. సిర్లమామిడిలో శుక్రవారం జరిగిన ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.