Share News

విదేశీ శిక్షణకు ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులు

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:56 PM

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులకు అందించే విదేశీ శిక్షణకు జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.

విదేశీ శిక్షణకు ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులు
విజయవాడలో నిర్వహిస్తున్న శిక్షణలో తర్కూ దేశీయులతో టీచర్లు సత్యారావు, రాంబాబు

మత్స్యపురం, చిలకలగెడ్డ టీచర్లు సత్యారావు, రాంబాబు ఎంపిక

ఆగస్టు 17 నుంచి 26 వరకు ఫిన్లాండ్‌ దేశం తర్కూ, రూమా నగరాల్లో శిక్షణ

పాడేరు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులకు అందించే విదేశీ శిక్షణకు జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. 2025- 26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన వారికి విద్యా సంస్కరణల్లో భాగంగా అంతర్జాతీయ శిక్షణ అందిస్తామని గతేడాది రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లాలో హుకుంపేట మండలం మత్స్యపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మొస్య సత్యారావు, అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఆశ్రమ పాఠశాల సోషల్‌ టీచర్‌ శెట్టి రాంబాబులను విదేశీ శిక్షణకు ఎంపిక చేశారు. తొలి దశగా ప్రస్తుతం విజయవాడలో ఫిన్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ తర్కూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. రెండో దశలో ఆగస్టు 17 నుంచి 26 వరకు ఫిన్లాండ్‌ దేశంలోని తర్కూ, రూమా నగరాల్లోని పాఠశాలల్లో అమలు చేసున్న విద్యావిధానాలపై అవగాహన/శిక్షణ అందిస్తారు. మూడో దశలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్‌ తర్కూకు చెందిన విదేశీ ప్రొఫెసర్లు ఆన్‌లైన్‌లో వారికి అవసరమైన శిక్షణ అందిస్తారు. గిరిజన ప్రాంతంలో పని చేస్తున్న తమకు అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన మంత్రి నారా లోకేశ్‌కు ఉత్తమ ఉపాధ్యాయులు సత్యారావు, రాంబాబులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తమను ప్రోత్సహిస్తున్న దానికి రెట్టింపుగా గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 10:56 PM