Share News

ఉపమాక వెంకన్న ఆలయం చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:49 AM

నక్కపల్లి మండలం ఉపమాకలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు.

ఉపమాక వెంకన్న ఆలయం చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

రూ.17.68 లక్షల విలువ చేసే నగదు, బంగారం, వెండి వస్తువులు స్వాధీనం

ఎస్పీ తుహిన్‌సిన్హా వెల్లడి

ఐదు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు

అనకాపల్లి రూరల్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి):

నక్కపల్లి మండలం ఉపమాకలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడిమా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఉపమాక వేంకటేశ్వరస్వామి కొండకింద వున్న ఆలయంలో ఈ నెల రెండో తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత ఇద్దరు ఆగంతకులు ముఖాలకు ముసుగులు కప్పుకొని ప్రవేశించారు. ప్రధాన ఆస్థాన మండపంలోగల హుండీ, గోదాదేవి అమ్మవారి మూలవిరాట్‌ సన్నిధి ప్రాంగణంలో ఉన్న మరో హుండీని పగులగొట్టి అందులో ఉన్న డబ్బు, నగలు పట్టుకుపోయారు. మూడో తేదీ ఉదయం ఐదు గంటలకు ఈ విషయాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది, ఆలయ ఇన్‌స్పెక్టర్‌, అర్చకులకు సమాచారం ఇచ్చారు. అనంతరం చుట్టుపక్కల ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టగా, హుండీల్లో వున్న కొన్ని బంగారు వస్తువులు, వెండి ఆభరణాలను ఆలయానికి వెనుక ఉన్న జీడిమామిడి తోటలో కనిపించాయి. హుండీల్లో చిల్లర నాణేలు మినహా నోట్లను ఆగంతకులు అపహరించుకుపోయారు. ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్స్‌ ఆధారంగా నిందితులు నక్కపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కశిరెడ్డి శ్రీహరి, రేబాక గ్రామానికి చెందిన గంట్యాడ చిన్నాగా గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆదివారం ఉద్దండపురం బస్టాపు వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు. ఉపమాక ఆలయంలో చోరీకి పాల్పడినట్టు అంగీకరించారు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి, రూ.2,38,078 నగదు, రూ.8,28,800 విలువ చేసే 56 గ్రాముల బంగారం, రూ.7,02,000 విలువ చేసే వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం చోరీ సొత్తు విలువ రూ.17.68 లక్షలు వుంటుందని అంచనా. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. సంఘటన జరిగిన ఐదు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసి, చోరీ సొత్తును శతశాతం రికవరీ చేసిన నక్కపల్లి పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రశంసాపత్రాలతోపాటు నగదు రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 01:49 AM