Share News

బంగారం చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:04 AM

చోరీ జరిగిన ఆరు రోజుల్లోనే పట్టణ పోలీసులు కేసును ఛేదించి సుమారు రూ.8.5 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ గఫూర్‌ శుక్రవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.

బంగారం చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
మీడియా సమావేశంలో సీఐ గఫూర్‌. వెనుక ముఖాలకు నల్లటి ముసుగులో వున్న నిందితులు

రూ.8.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు

నర్సీపట్నం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): చోరీ జరిగిన ఆరు రోజుల్లోనే పట్టణ పోలీసులు కేసును ఛేదించి సుమారు రూ.8.5 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ గఫూర్‌ శుక్రవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు.

అనకాపల్లి మండలం బవులువాడ రిక్షా కాలనీకి చెందిన షేక్‌ చాంద్‌ బాషా అద్దె ఆటో నడుపుకుంటూ ఇదే కాలనీకి చెందిన గాలి సత్యవతి అలియాస్‌ సత్తెమ్మతో కలిసి దొంగతనాలు చేస్తున్నారు. బాషా ఆటోతో లైన్‌మీదకు వెళ్లినప్పుడు సత్యవతి సాధారణ ప్రయాణికురాలి మాదిరిగా ఆటో ఎక్కుతుంది. దారిలో ఆటో ఎక్కిన ఇతర ప్రయాణికులతో మాట కలుపుతుంది. వీలుచూసుకొని వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదు తస్కరిస్తుంది. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీన నర్సీపట్నం వెలమ వీధికి చెందిన దేవాడ త్రివేణి, చోడవరంలో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు నర్సీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. కొంత దూరం వెళ్లిన తర్వాత.. పింఛన్‌ డబ్బులు ఇవ్వడానికి సచివాలయ సిబ్బంది వచ్చారని బంధువులు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో ఆమె చోడవరం వెళ్లకుండా తిరిగి నర్సీపట్నం వచ్చేసింది. ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లో దిగి ఇంటికి (వెలమవీధి) వెళ్లడానికి ఆటో ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బ్యాగులో పెట్టిన పర్సులో భద్రపరిచిన రెండు బంగారం గాజులు, రెండు పేటల గొలుసు, చెవి దిద్దులు కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆటోలో ప్రయాణించిన వారే చోరీకి పాల్పడి వుంటారని అనుమానం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసిన సీఐ గఫూర్‌.. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కాంపెక్స్‌ సమీపంలో వున్న సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఆటో రిజిస్ట్రేషన్‌ నంబరును గుర్తించి, నిఘా పెట్టారు. శుక్రవారం తుని రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో వెళుతున్న బాషా, సత్యవతిలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8.5 లక్షల విలువ చేసే 60 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై కొత్తకోట, చోడవరం, గాజువాక, మల్కాపురం, పీఎం పాలెం, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు.

Updated Date - Feb 07 , 2026 | 01:04 AM