Share News

పసుపు కొనుగోళ్ల ఆరంభం అదుర్స్‌

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:23 AM

మన్యంలో ఈ ఏడాది పసుపు కొమ్ముల కొనుగోళ్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. గత సోమవారం పెదబయలు, గురువారం గుత్తులపుట్టు, శనివారం హుకుంపేట వారపు సంతల్లో పసుపు కొమ్ముల కొనుగోళ్లు ముమ్మరంగా మొదలయ్యాయి. ప్రారంభంలోనే కిలో రూ.135 ధర ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పసుపు కొనుగోళ్ల ఆరంభం అదుర్స్‌
హుకుంపేట సంతలో వర్తకులు కొనుగోలు చేసిన పసుపు కొమ్ముల బస్తాలు

- సీజన్‌ మొదట్లోనే కిలో కొమ్ములు రూ.135 చొప్పున విక్రయం

- ధర ఆశాజనకంగా ఉండడంతోగిరి రైతుల ఆనందం

- రెండేళ్లుగా ధర తగ్గకపోవడంతో రైతులు, వర్తకుల్లో ధీమా

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో ఈ ఏడాది పసుపు కొమ్ముల కొనుగోళ్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. గత సోమవారం పెదబయలు, గురువారం గుత్తులపుట్టు, శనివారం హుకుంపేట వారపు సంతల్లో పసుపు కొమ్ముల కొనుగోళ్లు ముమ్మరంగా మొదలయ్యాయి. ప్రారంభంలోనే కిలో రూ.135 ధర ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏజెన్సీలో కిలో పసుపు కొమ్ములను రూ.130 నుంచి రూ.135కు వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుత ధర గిట్టుబాటు కావడంపై రైతులు సంతోషంగా వున్నారు. 2019లో కిలో రూ.120 నుంచి రూ.140 వరకు ధర ఉండే పసుపు, కొవిడ్‌ తర్వాత నుంచి కిలో రూ.65 నుంచి రూ.75 ఉండగా, 2023లో ఘోరంగా రూ.65 కంటే ఒక్క రూపాయి పెరగలేదు. దీంతో పసుపు రైతులు దిగాలు చెందారు. ఏజెన్సీ వ్యాప్తంగా సుమారుగా 25 వేల ఎకరాల్లో గిరిజనులు పసుపును సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏజెన్సీ వారపు సంతల్లో పసుపు కొమ్ముల క్రయవిక్రయాలు మొదలవుతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో కొనుగోలు మొదలయ్యాయి.

ప్రారంభంలోనే జోరుగా క్రయ విక్రయాలు

ఏజెన్సీ వారపు సంతల్లో ప్రారంభంలోనే పసుపు క్రయవిక్రయాలు జోరందుకోవడం విశేషం. దీంతో గిరిజన గ్రామాల్లో భూమిలోని పసుపును తవ్వడం, దానిని పెద్ద పాత్రల్లో వేసి ఉడకబెట్టడం, తర్వాత ఎండ బెట్టడం చేస్తుండగా, పూర్తిగా ఎండిన తర్వాత వారపు సంతలకు తీసుకువచ్చి విక్రయించుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పసుపు క్రయవిక్రయాలు జోరందుకోవడంతో రాష్ట్రంలోని పసుపు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నది. దీంతో దేశీయ మార్కెట్‌లో పసుపు కొనుగోలుకు ట్రేడర్లు ఎగబడడంతో డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ధర సైతం ఆశాజనకంగా ఉంది. శనివారం హుకుంపేట వారపు సంతలో సుమారుగా వెయ్యి బస్తాల పసుపు కొమ్ములను వి.మాడుగుల, జోలాపుట్‌ ప్రాంతాలకు చెందిన వర్తకులు కొనుగోలు చేశారు. వాటిని వ్యాన్లలో ఆయా ప్రాంతాలకు తరలించారు. పసుపు కొనుగోళ్లతో హుకుంపేట సంతలో సందడి నెలకొంది.

Updated Date - Mar 01 , 2026 | 01:23 AM