ముమ్మరంగా పసుపు సేకరణ
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:52 AM
మన్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గిరిజన రైతులు తమ భూముల్లోని పసుపును తవ్వి తీస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరి, రాగుల కోతలు, కాఫీ పండ్ల సేకరణ పూర్తయిన తర్వాత గిరిజన రైతులు పసుపు సేకరణపై దృష్టి సారిస్తారు.
ఏజెన్సీ వ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో సాగు
మార్కెటింగ్ సౌకర్యం ఊసే లేదు
వారపు సంతలే గిరి రైతులకు ప్రధాన ఆధారం
ఈ నెలాఖరు నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు క్రయవిక్రయాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గిరిజన రైతులు తమ భూముల్లోని పసుపును తవ్వి తీస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరి, రాగుల కోతలు, కాఫీ పండ్ల సేకరణ పూర్తయిన తర్వాత గిరిజన రైతులు పసుపు సేకరణపై దృష్టి సారిస్తారు.
ఏజెన్సీ వ్యాప్తంగా సుమారుగా 25 వేల ఎకరాల్లో గిరిజనులు పసుపును సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబరు నెలాఖరు నుంచి తమ భూముల్లోని పసుపు తవ్వి తీసి ఇళ్లలో కుప్పలుగా పోసి నిల్వ చేస్తారు. భూమిలోంచి పసుపు సేకరణ పూర్తయిన తర్వాత వాటిని పెద్ద పాత్రలు, ఇనుప డ్రమ్ముల్లో పూర్తిగా ఉడకబెడతారు. అలాగే బాగా ఉడికించిన పసుపును ఎటువంటి తేమ లేకుండా పూర్తిగా ఎండేలా ఎండలో ఆరబెడతారు. పూర్తిగా ఎండిన పసుపును వారపు సంతల్లో వర్తకులకు విక్రయిస్తుంటారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది సీజన్ కాస్త ఆలస్యం కావడంతో ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఏజెన్సీ వారపు సంతల్లో పసుపు క్రయవిక్రయాలు మొదలవుతాయి.
పచ్చి పసుపునకు పెరిగిన డిమాండ్
గతానికి భిన్నంగా ఈ ఏడాది పచ్చి పసుపునకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పలువురు వర్తకులు, రైతులు ఉత్పత్తిదారు సంఘాలు సైతం గిరిజన రైతుల వద్ద కిలో రూ.40 చొప్పున పచ్చి పసుపును కొనుగోలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో విత్తనాలుగా, కాస్మోటిక్ పదార్ధాల్లో వినియోగానికి పచ్చి పసుపును కొనుగోలు చేస్తున్నట్టు వర్తకులు తెలిపారు. అయితే ఇన్నాళ్లు ఎండు పసుపును మాత్రమే విక్రయించే రైతులకు పచ్చి పసుపు అమ్మకాలు కొత్తగా ఉన్నాయి. అయితే తమకున్న అవసరాన్ని బట్టి పలువురు రైతులు పచ్చి పసుపును విక్రస్తున్నారు. ఎక్కువ మంది ఉడికించి ఎండబెట్టి అమ్మడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
మార్కెటింగ్ సౌకర్యం ఊసే లేదు
ఏజెన్సీలో అధిక సంఖ్యలో గిరిజనులు పండించే పసుపునకు మన్యంలో కనీస మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో రైతులు ఆశించిన ధర దక్కడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి గిరిజన సహకార సంస్థ లేదా ట్రైఫెడ్ వంటి సంస్థలు గిరిజనుల నుంచి పసుపును కొనుగోలు చేసి దేశీయ మార్కెట్‌లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అయితే గిరిజన ప్రాంతంలో పసుపునకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించే జీసీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా కనీస చర్యలు చేపట్టడం లేదని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు పసుపునకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే తమకు మద్దతు ధర ఉంటుందని, ఫలితంగా ఏ పరిస్థితుల్లోనూ నష్టపోకుండా ఉంటామని పసుపు రైతులు చెబుతున్నారు.