Share News

అధ్వానంగా తుమ్మనవలస-గుమ్మకోట రోడ్డు

ABN , Publish Date - Apr 03 , 2026 | 10:57 PM

మండలంలోని తుమ్మనవలస-గుమ్మకోట రోడ్డు అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.

అధ్వానంగా తుమ్మనవలస-గుమ్మకోట రోడ్డు
మండపర్తి వద్ద కోతకు గురైన రోడ్డు

ఎక్కడికక్కడ గుంతలు

పాడైన కాజ్‌వేలు, సీసీ రోడ్డు

రోడ్డుకిరువైపులా పెరిగిన తుప్పలు

ఎదురుగా వచ్చిన వాహనాలు కనిపించక

ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

అనంతగిరి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తుమ్మనవలస-గుమ్మకోట రోడ్డు అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో 30 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. తుమ్మనవలస వంతెన దాటిన నుంచి భీంపోల్‌ వెళ్లే వరకు సీసీ రోడ్డు అధ్వానంగా తయారైంది. తుమ్మనవలస వలస నుంచి గుమ్మకోట వరకు ఉన్న 18 కిలోమీటర్లు రోడ్డును 15 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ రోడ్డు నిర్వహణను ఆర్‌అండ్‌బీ చూడాలి. ఆ శాఖ అధికారులు ఈ రోడ్డును అసలు పట్టించుకోవడం మానేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఆనుకుని తుప్పలు తొలగించకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్డంతా కోతకు గురైంది. తట్టవలస-మండిపర్తి మధ్యలోని 300 మీటర్ల సీసీరోడ్డు పాడైపోయింది. గొండ్రంగిపాడు గ్రామం వద్ద రోడ్డంతా పూర్తిగా కొట్టుకుపోయి గుంత ఏర్పడింది. నేరడువలస- భీంపోల్‌ మధ్యలోని సీసీ రోడ్డంతా కోతకు గురైంది. భీంపోల్‌-లువ్వా కాజ్‌వే అటు ఇటు సీసీరోడ్లు పూర్తిగా కొట్టుకుపోయి, గుంతలు ఏర్పడ్డాయి.

ఎస్‌.కోట నుంచి గుమ్మకోటకు ఆర్టీసీ బస్సు

విజయనగరం జిల్లా ఎస్‌.కోట నుంచి తుమ్మనవలస మీదుగా గుమ్మకోట వరకు ప్రతిరోజూ ఆర్టీసీ బస్సు నడుస్తుంది. ఎస్‌.కోటలోని ఉదయం 6 గంటలకు బయలుదేరి గుమ్మకోటకు 7.30 గంటల చేరుతుంది. అక్కడ ఉదయం 8 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు ఎస్‌.కోట చేరుకుంది. రోజూ మూడు సర్వీసులు ఉంటాయి. ఉదయం రెండు సర్వీసులు, సాయంత్రం ఒక సర్వీసు ఉంటుంది. అధికారులు స్పందించి, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గిరిజనులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 10:57 PM