Share News

అసంపూర్తి దారితో అవస్థలు

ABN , Publish Date - May 23 , 2026 | 12:19 AM

జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు మండలానికి వెళ్లే ప్రధాన మార్గంలో అసంపూర్తిగా వదిలేసిన రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా ఉంది. ఈ మార్గంలో వాహనాలు వెళితే ధూళి ఎగసిపడడంతో వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయి.

అసంపూర్తి దారితో అవస్థలు
ఐదు నెలలుగా అసంపూర్తిగా ఉన్న పెదబయలు రోడ్డు

అధ్వానంగా పాడేరు- జోలాపుట్టు రోడ్డు

ఐదు కిలోమీటర్ల మేర మెటల్‌ పరిచి వదిలేయడంతో ఇబ్బందులు

దుమ్ము ఎగసిపడుతుండడంతో ద్విచక్ర వాహనదారులకు కష్టాలు

ఐదు నెలలుగా ఇదే దుస్థితి

పట్టించుకోని అధికారులు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

గత ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పాడేరు- జోలాపుట్టు మెయిన్‌రోడ్డులోని పెదబయలు మండల పరిధిలోకి వచ్చే ఐదు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధికి చేసేందుకు కూటమి ప్రభుత్వం రూ.9.6 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో రోడ్డు గుంతలు పూడ్చడం, వెడల్పు చేయడం వంటి పనులు ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయి ఇన్నాళ్ల అవస్థలు తీరుతాయని భావించినప్పటికీ, అందుకు భిన్నంగా జనవరి నుంచి ఇప్పటికీ ఆ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా అసంపూర్తిగానే వదిలేశారు.

డ్రైవర్లు, ప్రయాణికులకు నిత్యం నరకం

జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు, జోలాపుట్టు, అటుగా ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్న డ్రైవర్లు, ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. ఐదు కిలోమీటర్ల రోడ్డును తవ్వేసి మెటల్‌, మట్టి వేసి ఐదు నెలలుగా వదిలేశారు. దీంతో ఈ మార్గంలో ప్రమాణించేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ద్విచక్రవాహన చోదకులు నిత్యం ప్రమాదాలకు గురికావడంతోపాటు ముందుగా పెద్ద వాహనాలు వెళితే ఆ ధూళికి మరింత ఇబ్బందికి గురవుతున్నారు. రోడ్డుపై మెటల్‌ పరిచి వదిలేయడంతో కార్లు, జీపుల టైర్లు పంక్ఛర్‌ అవుతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే వర్షం కురిస్తే ఈ మార్గంలో రాకపోకలు సాగించలేకపోతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ రోడ్డును త్వరలో పూర్తి చేయాలని మన్యం వాసులు కోరుతున్నారు.

Updated Date - May 23 , 2026 | 12:19 AM