కాలం చెల్లిన బస్సులతో కష్టాలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:38 PM
కండీషన్‌లో లేని కాలం చెల్లిన డొక్కు బస్సులను ఆర్టీసీ అధికారులు జిల్లాలో నడుపుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం ఎక్కడో అక్కడ సాంకేతిక లోపంతో బస్సులు ఆగిపోతున్నాయి.
ధారాలమ్మ ఘాట్ రోడ్డులో నిలిచిపోయిన భద్రాచలం- విశాఖపట్నం బస్సు
ఆరు గంటల పాటు ఆకలితో అలమటించిన ప్రయాణికులు
పెదబయలు మండలంలో రెండు బస్సులు మొరాయింపు
జిల్లాలో నిత్యం ఇదే సమస్య
సీలేరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కండీషన్‌లో లేని కాలం చెల్లిన డొక్కు బస్సులను ఆర్టీసీ అధికారులు జిల్లాలో నడుపుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం ఎక్కడో అక్కడ సాంకేతిక లోపంతో బస్సులు ఆగిపోతున్నాయి. ఆదివారం మూడు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ధారాలమ్మ ఘాట్ రోడ్డులో భద్రాచలం- విశాఖపట్నం బస్సు, పెదబయలు మండలంలో రెండు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
విశాఖపట్నం ఆర్టీసీ డిపోనకు చెందిన భద్రాచలం- విశాఖపట్నం బస్సు ఆదివారం ఉదయం 5.45 గంటలకు భద్రాచలంలో బయలుదేరి చింతూరు, మోతుగూడెం, సీలేరు మీదుగా విశాఖపట్నం వెళుతుండగా జీకే వీధి మండలం సీలేరు దాటిన తరువాత ధారకొండ ఘాట్ రోడ్డులో ధారాలమ్మ ఆలయం దిగువ మలుపు వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో విశాఖపట్నం నవోదయ పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు భధ్రాచలంలో క్రీడా పోటీలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ బస్సులో వస్తున్నారు. ఈ బస్సు ఉదయం 11 గంటల సమయంలో నిలిచిపోవడంతో డ్రైవర్ వెంటనే విశాఖ డిపో డీఎంకు సమాచారం ఇచ్చారు. అందించారు. ప్రయాణికులను తరలించడానికి బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపిన డీఎం సాయంత్రం ఐదు గంటల వరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆకలితో అలమటించారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారకొండ వెళ్లి భోజనాలు చేసి వస్తామని కొంత మంది ప్రయాణికులు డ్రైవర్‌కు చెబితే మరో బస్సు వస్తోందని, ఆ సమయంలో ఇక్కడ లేకపోతే ఏమీ చేయలేమని చెప్పడంతో చేసేది లేక ఆకలితో బస్సు వద్దే ఉండిపోయారు. కాగా ఈ బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సీలేరు ఎస్‌ఐ ఎండీ యాసిన్ అక్కడకు వెళ్లి టిప్పర్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు చేర్చారు. కాగా సాయంత్రం ఐదు గంటలకు సీలేరు- నర్సీపట్నం బస్సులో ప్రయాణికులను నర్సీపట్నం వరకు పంపించారు. అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులను వేరే బస్సులో పంపిస్తామని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు.
మొరాయించిన రెండు బస్సులు
పెదబయలు: పాడేరు నుంచి పెదబయలు మండలంలోని బొంగరం పంచాయతీ కేంద్రానికి బయలుదేరిని ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం గంపరాయి వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరో బస్సు అందుబాటులో లేక మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంత వేచి చూసినా ఆర్టీసీ డిపో నుంచి బొంగరం వరకు వేరే బస్సును ఏర్పాటు చేయకపోవడంతో నిరాశ చెంది గత్యంతరం లేక పలువురు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ బస్సుపైనే ఆఽధారపడిన బంగారుమెట్ట, పర్రెడా, బొండాపల్లి, పొయిపల్లి, గోమంగి, బొంగరం, ఇంజరీ, గిన్నెలకోట పంచాయతీల గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బొంగరం, బూసిపుట్టు వంటి సింగిల్ బస్సు సర్వీసులు నడిచే మార్గాల్లో ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేక అవస్థలు పడ్డారు. అలాగే అనకాపల్లి నుంచి జోలాపుట్టు వెళుతున్న అనకాపల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం పెదబయలు మండల కేంద్రంలో టైర్ పంచర్ కావడంతో నిలిచిపోయింది. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభించింది. డ్రైవర్ బస్సు టైరు మార్చడంతో రాకపోకలు యథావిధిగా సాగాయి.