అసంపూర్తి పనులతో అవస్థలు
ABN , Publish Date - May 23 , 2026 | 12:18 AM
మండలంలో కాశీపురం- బి.కింతాడ ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఈ రహదారి నిర్మాణ పనులను గత ప్రభుత్వ హయాంలో కేంద్ర రహదారులు, మౌలికవసతుల నిధుల (సీఆర్‌ఐఎఫ్)తో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాంట్రాక్టర్‌కు చెల్లించకుండా వేరే అవసరాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
గత ప్రభుత్వ నిర్వాకంతో ఆగిన కాశీపురం- బి.కింతాడ రోడ్డు విస్తరణ
సీఆర్‌ఐఎఫ్ నుంచి రూ.20 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
మూడేళ్ల క్రితం శంకుస్థాపన.. శరవేగంగా పనులు
మెటల్‌పరిచి, కల్వర్టులు నిర్మించిన తరువాత బిల్లు పెట్టిన కాంట్రాక్టర్
కేంద్రం విడుదల చేసిన నిధులను దారిమళ్లించిన వైసీపీ ప్రభుత్వం
రోడ్డు పనులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
పునరుద్ధరణతోపాటు బిల్లుల మంజూరు కోసం ఎమ్మెల్యే బండారు కృషి
దేవరాపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో కాశీపురం- బి.కింతాడ ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఈ రహదారి నిర్మాణ పనులను గత ప్రభుత్వ హయాంలో కేంద్ర రహదారులు, మౌలికవసతుల నిధుల (సీఆర్‌ఐఎఫ్)తో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాంట్రాక్టర్‌కు చెల్లించకుండా వేరే అవసరాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
దేవరాపల్లి-చోడవరం ప్రధాన మార్గంలో కాశీపురం నుంచి బి.కింతాడ వరకు 15 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డును అభివృద్ధి చేయడానికి గత వైసీపీ హయాంలో కేంద్రం ప్రభుత్వం సీఆర్‌ఐఎఫ్ నుంచి రూ.20 కోట్లు మంజూరు చేసింది. 2023 ఏప్రిల్ 30వ తేదీన అప్పటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన బూడిముత్యాలనాయుడు, టీటీడీ నాటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలో కలసి బి.కింతాడ వద్ద శంకుస్థాపన చేశారు. అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ చేసుకున్నారు. 12.5 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును 25 అడుగులకు విస్తరించాలి. తొలుత మెటల్‌వేసి, క్రషర్ బుగ్గి చల్లి, రోలింగ్ చేయాలి. తరువాత దీనిపై తారు రోడ్డు వేయాలి. మధ్యలో 48 కల్వర్టులను నిర్మించాలి. అయితే కేంద్రం మంజూరు చేసిన నిధులతో 13 కిలోమీటర్ల వరకే పనులు చేయడానికి సరిపోతాయని ఇంజనీరింగ్ అధికారులు భావించి కాశీపురం నుంచి చిననందిపల్లి వరకే రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆరంభంలో పనులు వేగంగానే సాగాయి. మెటల్ పనులు, కల్వర్టుల నిర్మాణం పూర్తయ్యాయి. అప్పటికి సుమారు రూ.10.7 కోట్ల విలువైన పనులు చేసి బిల్లులు అప్‌లోడ్ చేశారు. కొద్ది రోజుల తరువాత కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కానీ అప్పటి వైసీపీ పాలకులు ఈ నిధులను వేరే అవసరాలకు మళ్లించి, కాంట్రాక్టర్‌కు మొండిచేయి చూపారు. దీంతో కాంట్రాక్టర్ 2024 సాధారణ ఎన్నికల ముందు పనులు ఆపేశారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించని విషయం కేంద్రం దృష్టికి రావడంతో రోడ్డు పనులను రద్దు చేసింది. మెటల్ దశలో పనులు ఆగిపోయి రాళ్లు లేచిపోవడంతో ఈ రహదారిపై ప్రయాణించే పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవరాపల్లి మండల ప్రజలు చోడవరం వెళ్లేందుకు ఇదే ప్రధానమార్గం. ఇంకా తారువ, తిమిరాం, వేచలం, పెదనందిపల్లి, కలిగొట్లతోపాటు అనంతగిరి మండలానికి చెందిన నాలుగు పంచాయతీల ప్రజలు పాడేరు వెళ్లడానికి ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. రహదారి మొత్తం రాళ్లు తేలి వుండడంతో వాకపల్లి వద్ద నుంచి చీడికాడ మండలం తురువోలు మీదుగా చోడవరం వెళుతున్నారు. దీనివల్ల సుమారు పది కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది.
ఎమ్మెల్యే బండారు చొరవ..
కాశీపురం- బి.కింతాడ రోడ్డు అభివృద్ధికి కేటాయించిన నిధులను గత ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తన అల్లుడు, కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్‌నాయుడు ద్వారా సంబంధిత మంత్రితో మాట్లాడి, రద్దు చేసిన పనులను పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. త్వరలో నిధులు మంజూరైతే కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరుపుతామని, ఆ వెంటనే మిగిలిన బీసీ, సీసీ పనులను చేయిస్తామని ఆర్‌అండ్‌బీ ఏఈఈ కె.బాలరాజు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.