వీఎంఆర్‌డీఏ టెండర్లలో కిరికిరి!
ABN , Publish Date - May 23 , 2026 | 12:40 AM
ఎన్‌టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్పుల్లో మౌలిక వసతుల కల్పన ‘పనులు’ తమకు కావలసిన వారికి దక్కేలా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘స్మార్ట్ టౌన్‌షిప్’ పనులు తమకు కావలసిన వారికి దక్కేలా నిబంధనలు
తక్షణం సవరించాలని మిగిలిన కాంట్రాక్టర్ల డిమాండ్
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
ఎన్‌టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్పుల్లో మౌలిక వసతుల కల్పన ‘పనులు’ తమకు కావలసిన వారికి దక్కేలా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగసాని అగ్రహారం-1, గంగసాని అగ్రహారం-2, రామవరంలలో వీఎంఆర్‌డీఏ స్మార్ట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో భూగర్భ మురుగునీటి పారుదల, మంచినీటి సరఫరా లైన్లు, సీసీ రహదారులు, బీటీ రోడ్లు, ప్రహరీ గోడల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. గంగసాని అగ్రహారం-1 లేఅవుట్‌కు రూ.19.23 కోట్లు, గంగసాని అగ్రహారం-2 లేఅవుట్‌కు రూ.9.84 కోట్లు, రామవరం లేఅవుట్‌కు రూ.21.6 కోట్లు కేటాయించింది. ఈ టెండర్లకు సంబంధించిన నిబంధనలు చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వారికి కావలసిన వారికి కాంట్రాక్టు ఇచ్చుకునేలా నిబంధనలు పెట్టారని, దీనివల్ల మిగిలిన కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారని విమర్శిస్తున్నారు. తక్షణమే నిబంధనలు మార్చి, అందరికీ పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
పారదర్శకంగానే టెండర్లు: ప్రణవ్ గోపాల్, చైర్మన్, వీఎంఆర్‌డీఏ
ఆయా లేఅవుట్లకు మౌలిక వసతులు కల్పించాలని ఇంజనీరింగ్ విభాగం టెండర్లు ఆహ్వానించింది. వాటికి సంబంధించి ఐదుగురు నుంచి ఆరుగురు ఇప్పటికే టెండర్లు దాఖలు చేశారు. వారిలో ఎల్-1 ఎవరైతే వారికే అవకాశం వస్తుంది. ఇందులో పారదర్శకంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించాం.
యూపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష రేపు
నగరంలో 17 కేంద్రాలు
7,763 మంది అభ్యర్థులు
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని 17 కేంద్రాల్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు 7,763 మంది హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, తప్పనిసరిగా గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించారు. పరీక్ష నిర్వహణపై ఆమె శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు, లోపవర్ జామర్లు ఏర్పాటుచేయాలని, మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలు అనుమతించవద్దని సూచించారు. కాగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడు సమన్వయ అధికారిగా, రాష్ట్ర ప్రభుత్వ పరిశీలకురాలిగా జేసీ విద్యాధరి, యూపీఎస్సీ పరిశీలకులుగా సౌరభ్‌సింగ్ వ్యవహరిస్తారు.
ఒకటి నుంచి ఏయూ స్పెషల్ ఎగ్జామ్స్
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ (బీఏ, బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీసీఏ, బీహెచ్‌ఎం) కోర్సుల్లో బ్యాక్‌లాగ్స్ ఉండిపోయిన విద్యార్థుల కోసం నిర్వహించ తలపెట్టిన ‘స్పెషల్ ఎగ్జామ్స్’ ప్రారంభ తేదీని ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు శుక్రవారం ప్రకటించారు. పీజీ పరీక్షల తేదీలను కొద్దిరోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. జూన్ ఒకటో తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎగ్జామ్స్ డిప్యూటీ రిజిస్ర్టార్ ఎం.పద్మరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో 2010-14 మధ్య చేరిన విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఉన్న పెండింగ్ సబ్జెక్టులు, 2015-19, 2020-2022 మధ్య చేరిన విద్యార్థులకు తొలి సెమిస్టర్ నుంచి ఐదో సెమిస్టర్ వరకు పరీక్షలు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. పరీక్షలకు మూడు రోజులు ముందు నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు ఏయూ వెబ్‌సైట్ చూడాలన్నారు.