అతలాకుతలం
ABN , Publish Date - May 23 , 2026 | 11:43 PM
వాతావరణంలో వచ్చిన మార్పులతో శనివారం సాయంత్రం పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలంగా ఈదురుగాలులు వీచి భారీ వర్షం పడింది.
పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం
నేలకూలిన చెట్లు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలు
పలు చోట్ల కూలిన పెంకుటిళ్ల పైకప్పులు
పాయకరావుపేట/నక్కపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో వచ్చిన మార్పులతో శనివారం సాయంత్రం పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలంగా ఈదురుగాలులు వీచి భారీ వర్షం పడింది. అర్ధగంటపాటు వీచిన ఈదురుగాలులకు పాయకరావుపేటలోని షీలానగర్, రాజుగారిబీడు, ఆనందనగర్‌కాలనీ, తాండవ షుగర్ ఏరియా, తదితర ప్రాంతాల్లో సుమారు 30 విద్యుత్ స్తంభాలు నేలకూలగా, పలు వీధుల్లో చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు ఇళ్లపై ఉన్న సోలార్ పలకలు ఈదురుగాలులకు ఎగిరిపోయి కింద పడ్డాయి. దుర్గాకాలనీలో పెంకుటిల్లుపై వేపచెట్టు విరిగిపడడంతో పైకప్పు కూలిపోయింది. ఈదురుగాలుల ప్రారంభంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా రాత్రి 7 గంటల తరువాతగానీ పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నక్కపల్లి మండలంలో..
గొడిచెర్ల గ్రామంలో కొబ్బరి చెట్టు పడి నిట్లా సతీశ్ పెంకుటిల్లు, అదే గ్రామంలో ఈదురుగాలులకు నల్లల శ్రీను పెంకుటిల్లు దెబ్బతిన్నాయి. రమణయ్యపేటలోని ప్రధాన రహదారి సహా వీధులు, పంట పొలాల్లోనూ పలు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభం పంటపొలంలో కూలిపోయింది. రేబాక గ్రామంలో భారీ వర్షం కురిసింది. చీడిక కొత్తూరులో సుమారు ఐదు ఎకరాల్లో రైతుల బొప్పాయి తోటలు నేలకొరిగాయి. హైవేకు ఇరువైపులా వున్న పలు మొక్కలు, చెట్ల కొమ్మలు పడిపోయాయి. సుమారు గంట సేపు నక్కపల్లి మండలం ఈదురుగాలుల బీభత్సానికి వణికిపోయింది.
చినరాంభద్రపురంలో ఒకరి మృతి
నక్కపల్లి: మండలంలోని దేవవరం శివారు చినరాంభద్రపురం గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు శనివారం ఒక చెట్టు పడిపోవడంతో పులి రంగబాబు (50)అనే వ్యక్తి మృతి చెందినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు తాటిచెట్టు అతనిపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు డీటీ నారాయణరావు చెప్పారు.