Share News

కైలాసగిరిపై త్రిశూల్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:48 AM

ప్రసిద్ధి పర్యాటక కేంద్రం కైలాసగిరిపై పరమ శివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

కైలాసగిరిపై త్రిశూల్‌

పనులు ప్రారంభం

రూ.1.55 కోట్ల నుంచి రూ.2.5 కోట్లకు పెరిగిన బడ్జెట్‌

ఉగాదికి ప్రారంభించేలా ఏర్పాట్లు

విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):

ప్రసిద్ధి పర్యాటక కేంద్రం కైలాసగిరిపై పరమ శివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఢమరుకం కూడా పెడుతున్నారు. సుమారు రూ.1.55 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును శివర్రాతి నాటికి ప్రారంభించాలని భావించారు. అయితే యథా ప్రకారం అన్ని ప్రాజెక్టుల్లాగే ఇది కూడా ఆలస్యమైంది. ఇంజనీరింగ్‌ అధికారుల్లో 80 శాతం మంది మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణంలో నిమగ్నం కావడంతో ఈ పనులు ముందుకుసాగలేదు. దాంతో వ్యయం కూడా పెరిగింది.

కైలాసగిరిపై ఆ చివరన తెలుగు మ్యూజియం ఉంది. దూరంగా ఉండడంతో ఎవరూ అక్కడి వరకు వెళ్లడం లేదు. సర్క్యులర్‌ రైలు కూడా నిలిచిపోయింది. బ్యాటరీ కార్లు అవసరమైనన్ని అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆకర్షణీయమైన ‘త్రిశూల్‌’ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తే అటు వైపు కూడా సందర్శకుల సంఖ్యను పెంచవచ్చునని అధికారులు భావించారు. ఇటీవల ప్రారంభించిన గ్లాస్‌ బిడ్ర్జికి ఊహించని ఆదరణ లభిస్తోంది. ఎక్కువ మంది సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికే అక్కడికి వస్తున్నారు. త్రిశూల్‌ ప్రాజెక్టు కూడా ఆ విధంగానే అందరినీ ఆకర్షించాలనే ఉద్దేశంతో దానికి మరిన్ని మెరుగులు దిద్ది వ్యయం పెంచారు. పుణేలో 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో దీనిని తయారు చేయించారు. అక్కడి నుంచి విడి భాగాలు తీసుకువచ్చి, క్రేన్‌ సాయంతో అమరుస్తున్నారు. సోమవారం ఈ పనులు ప్రారంభమయ్యాయి. దీని చుట్టూ సందర్శకులు కూర్చొనేలా వేదిక నిర్మిస్తారు. రాత్రిపూట నగరంలో ఎక్కడి నుంచి చూసినా దేదీప్యమానంగా కనిపించేలా ఎల్‌ఈడీ లైట్లు కూడా పెట్టనున్నారు.

తుఫాన్‌ గాలులకు తట్టుకునేలా నిర్మాణం

ప్రణవ్‌ గోపాల్‌, చైర్మన్‌, వీఎంఆర్‌డీఏ

హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు కైలాసగిరికి బాగా నష్టం జరిగింది. ఆ స్థాయిలో తుఫాన్‌ గాలులు వచ్చినా తట్టుకునేలా బలంగా త్రిశూల్‌ నిర్మిస్తున్నాం. దీనిని ఉగాది నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఇది విశాఖ వచ్చే పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

Updated Date - Feb 24 , 2026 | 01:48 AM