ఆదివాసీల మహాధర్నా
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:37 PM
ప్రధానమంత్రి జన్‌మన్ ఇళ్లను నిర్మించుకున్న ఆదివాసీల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన
పీఎం జన్‌మన్ ఇళ్ల బిల్లులు తక్షణమే చెల్లించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్
పాడేరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి జన్‌మన్ ఇళ్లను నిర్మించుకున్న ఆదివాసీల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పీఎం జన్‌మన్ ఇళ్ల బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌పై గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం ముందు చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఎం జన్‌మన్ పథకంలో ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందకపోవడంతోపాటు అదనంగా ఇస్తామన్న రూ.లక్ష ప్రోత్సాహకం సైతం అందలేదన్నారు. దీంతో అనేక మంది లబ్ధిదారులు ఇళ్లను పూర్తి చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పీఎం జన్‌మన్ ఇంటి యూనిట్ ధర రూ.2 లక్షల 39 వేల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆదివాసీలకు ఎటువంటి కేటాయింపులు లేకపోవడం ఘోరమన్నారు. కార్పొరేట్ శక్తులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాక్సైట్ మైనింగ్‌లపై ఉన్న శ్రద్ధ ఆదివాసీల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై లేదని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా అందాల్సిన 12 రకాల సదుపాయాలను ఆదివాసీలకు అందించాలన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, జీవో:3పై ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు పట్టణ వీధుల్లో పీఎం జన్‌మన్ లబ్ధిదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లపై హౌసింగ్ పీడీ బి.బాబునాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు కె.లోకనాథం, పి.అప్పలనర్స, గిరిజన సంఘం నేతలు కిల్లో సురేంద్ర, ఎస్.ధర్మన్నపాడాల్, పి.బాల్‌దేవ్, ఎస్.చిరంజీవి, సత్యనారాయణ, సూర్యనారాయణ, బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.