Share News

గిరిజన యువత కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధపడాలి

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:03 AM

గిరిజన యువత కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధం కావాలని ఎస్పీ అమిత్‌బర్దార్‌ సూచించారు. మంగళవారం స్థానిక డీఎస్పీ సీహెచ్‌.తిరుమలరావుతో కలిసి ఆయన మండలంలోని బెన్నవరం పంచాయతీ పోతురాజుగున్నలు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులతో ఎస్పీ సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

గిరిజన యువత కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధపడాలి
పోతురాజుగున్నలులో గిరిజనులతో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌బర్దార్‌

రైతులకు ప్రత్యామ్నాయ ఉద్యాన, పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ చొరవ

ఎస్పీ అమిత్‌బర్దార్‌

చింతపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

గిరిజన యువత కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధం కావాలని ఎస్పీ అమిత్‌బర్దార్‌ సూచించారు. మంగళవారం స్థానిక డీఎస్పీ సీహెచ్‌.తిరుమలరావుతో కలిసి ఆయన మండలంలోని బెన్నవరం పంచాయతీ పోతురాజుగున్నలు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులతో ఎస్పీ సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అమిత్‌బర్దార్‌ మాట్లాడుతూ గిరిజన యువతీ, యవకులు పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అవసరమైన శరీర దారుఢ్యం కలిగి ఉంటారన్నారు. ప్రభుత్వం త్వరలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని, అర్హత గల వారు ఇప్పటి నుంచే ఫిజికల్‌, రాత పరీక్షకు సిద్ధమైతే ఉద్యోగాలను సాధిస్తారన్నారు. గిరిజన యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఎలా చేసుకోవాలని, ఏ విధంగా సిద్ధపడాలనే అంశాలను పోలీసులు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఎప్పటికప్పడు సమాచారం ఇస్తారన్నారు. గిరిజన యువత గంజాయి సాగు, రవాణా జోలికి వెళ్లరాదన్నారు. గిరిజనులు గంజాయి సాగును పూర్తిగా విడిచిపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. గిరిజన రైతులు కాఫీ, మిరియాలు సాగు చేసుకునేందుకు ఐటీడీఏ, వీబీ జీరామ్‌జీ ద్వారా డ్రాగన్‌ఫ్రూట్‌, ఆవకాడో, సిల్వర్‌ ఓక్‌, నారింజ, చింత, తదిరత ఉద్యాన పంటల మొక్కలను ఉచితంగా అందజేస్తుందన్నారు. ఉద్యానశాఖ ద్వారా అరుదైన రాంబూటాన్‌ సాగుకు సహకారం అందిస్తుందన్నారు. సాగుకు మూడేళ్లపాటు ప్రోత్సాహక నిధులను అందజేస్తుందన్నారు. ప్రభుత్వం ఈగల్‌ వ్యవస్థను అందుబాటులో తీసుకు రావడంతో గంజాయి సాగును నియంత్రించగలిగామన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ఆపదలోనున్న మహిళలకు సకాలంలో పోలీసులు సేవలు అందించేందుకు శక్తి యాప్‌ అందుబాటులో ఉందన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కలెక్టర్‌, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సీహెచ్‌.తిరుమలరావు, సీఐ బి. సింహాచలం, ఎస్‌ఐలు జి. వీరబాబు, సాయికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 01:03 AM