గిరిజన యువత అథ్లెటిక్స్, క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:19 AM
గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, యువకులు చక్కటి శరీర దారుఢ్యం కలిగి ఉంటారని, వారు అథ్లెటిక్స్, ఇతర క్రీడల్లో నైపుణ్యతను చాటిచెప్పాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. అరకు ఉత్సవ్‌లో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం అరకులోయ డిగ్రీ కళాశాల మైదానం నుంచి అంజోడ ఫైనరీ వరకు 5కె రన్‌ను ఆయన ప్రారంభించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
అరకు మారఽథాన్ పోటీలు ప్రత్యేకంగా నిర్వహిస్తాం..
అరకులోయ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, యువకులు చక్కటి శరీర దారుఢ్యం కలిగి ఉంటారని, వారు అథ్లెటిక్స్, ఇతర క్రీడల్లో నైపుణ్యతను చాటిచెప్పాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. అరకు ఉత్సవ్‌లో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం అరకులోయ డిగ్రీ కళాశాల మైదానం నుంచి అంజోడ ఫైనరీ వరకు 5కె రన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి మరథాన్‌లో ఆశ్రమ, పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభాపాటవాలు గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుంటే గిరిజన ప్రాంతానికి గుర్తింపు వస్తుందన్నారు. త్వరలోనే ఐటీడీఏ ఆధ్వర్యంలో అరకు ఆఫ్ మారఽథాన్ పోటీలు నిర్వహిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అథ్లెటిక్స్, ఇతర క్రీడాకారులకు వారికి అవసరమైన షూష్, ఇతర అవసరాలు తీర్చాలని సూచించారు. గిరిజన యువకుడు సింహాద్రి బెంగళూరులో శిక్షణ పొంది అథ్లెటిక్స్‌లో రాణించాడని, రవ్వలగుడలో ఉత్సాహవంతులైన 20 మంది యువకులకు ప్రతి రోజూ శిక్షణ ఇస్తున్నాడన్నారు. ఈ సందర్భంగా సింహాద్రిని కలెక్టర్ అభినందించారు. ఐటీడీఏ పీవో శ్రీపూజ మాట్లాడుతూ గిరిజన ప్రాంత విద్యార్థులకు చక్కటి ఆరోగ్యం, శరీర ఫిట్‌నెస్ ఉంటుందన్నారు. మాడగడ, వంజంగి వంటి హిల్స్‌ను ఈ ప్రాంతం వారు సులువుగా ఎక్కి దిగిపోతారని, అదే మైదానప్రాంతం వారు ఇబ్బంది పడతారన్నారు. ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర మాట్లాడుతూ ఇటువంటి ఉత్సవాల్లో నిర్వహించే క్రీడలతో గిరిజన యువకుల్లో దాగి ఉన్న క్రీడా సామర్థ్యం వెలుగులోకి వస్తుందన్నారు. అనంతరం 5కె రన్‌లో విజేతలుగా నిలిచిన గన్నెలకు చెందిన వి.రమేశ్‌కు (ప్రథమ స్థానం) రూ.15 వేలు నగదు, అరకుకు చెందిన వి.విశాల్ అభిషేక్‌కు(ద్వితీయ స్థానం) రూ.పది వేలు నగదు, వి.అప్పలస్వామికు(తృతీయ స్థానం) రూ.5 వేలు, పి.మోహనరావుకు(నాల్గో స్థానం) రూ.ఐదు వేలను విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, కలెక్టర్ దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ, ఆర్‌డీవో లోకేశ్ అందజేశారు. మారథాన్‌కు వచ్చిన వారిని ఉత్తేజపరిచి, వారితో రన్నింగ్ చేసిన గన్నెల పీహెచ్‌సీ వైద్యాధికారి జేకే.నాయుడు, అరకు ఎస్‌ఐ గోపాలరావులను మెడళ్లతో సత్కరించారు. అంతకుముందు మరో వైపు విద్యార్థులతో కలిసి కలెక్టర్, పీవో, సీఐ హిమగిరి, ఎస్‌ఐ గోపాలరావు నృత్యం చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీవో లోకేశ్. డీఎస్‌పీ అభిషేక్, డీపీవో చంద్రశేఖరరెడ్డి, అటవీ శాఖ రేంజర్ కోటేశ్వరరావు ,పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొరిబొరి లక్ష్మి, టీడీపీ అరకులోయ, డుంబ్రిగుడ మండలాల అధ్యక్షులు ఆనంద్, మహాదేవ్, పలువురు పీఈటీలు,పీడీలు పాల్గొన్నారు.