మౌలిక వసతులకు నోచుకోని గిరి గ్రామాలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:47 AM
మౌలిక వసతులకు నోచుకోని గిరి గ్రామాలు
11పీబీఎల్3ః
రహదారులు లేక డోలిమోతలు
తాగు నీటి కోసం తిప్పలు
పాఠశాలలు లేక చదువుకు
దూరమవుతున్న చిన్నారులు
అధికారులు స్పందించాలని గిరిజనుల వేడుకోలు
పెదబయలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాలు మౌలిక సౌకర్యాలకు నోచుకోక గిరిజనులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆయా గ్రామాలకు రోడ్లు, తాగునీరు, రవాణా, పాఠశాలలు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో గిరిజనులు జీవనం సాగిస్తున్నారు.
మండలంలోని బొంగరం పంచాయతీ పరిధిలోని వెదురుగొయ్యి, తీములవర, కంటిమామిడి, దోసలబంద, రాళ్లగొంది గిరిజన గ్రామాలు నేటికీ మౌలిక వసతులకు నోచుకోలేదు. ఇక్కడ ఉంటున్న గిరిజనులు దయనీయ జీవనం సాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలోని పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాలేదని గిరిజనులు వాపోతున్నారు. వెదురుగొయ్యి పీవీటీజీ గ్రామంలో 30 కుటుంబాలకు చెందిన 150 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. రాళ్లు, రప్పలు, కొండచరియలతో కూడిన ప్రమాదకర కాలిబాటలే గ్రామానికి రహదారి. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, వృద్ధులు, రోగులను ఆసుపత్రికి తరలించాలంటే ఇప్పటికీ డోలీలే ఆధారం. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా కిలోమీటర్ల మేర కాలినడకన కొండదారుల్లో ప్రయాణించి మోసుకొని తీసుకురావలసిన దుస్థితి ఉంది. వర్షాకాలంలో ఈ మార్గాల్లో నడవడానికి వారు పడుతున్న బాధలు వర్ణణాతీతం. గ్రామంలో రక్షిత నీటి పథకం లేకపోవడంతో గిరిజనులు ఊటలు, వాగులు, గుంతల్లో నిల్వ ఉండే కలుషిత నీటినే తాగుతున్నారు. దీంతో తరచూ జ్వరాలు, విరేచనాలు, ఇతర వ్యాధులు బారిన పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దోసలబంద గ్రామంలో పాఠశాల లేకపోవడంతో చిన్నారులు విద్యకు దూరమవుతున్నారు. చిన్న వయస్సులోనే దూర ప్రాంతాలకు వెళ్లలేక చాలామంది పిల్లలు చదువును మధ్యలోనే మానేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి, అక్షరాస్యత పెంపుపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. పిల్లలు ఉన్న గ్రామాల్లో పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం లేదు. బొంగరం పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల గిరిజనులు, జీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.