గిరిజన గ్రామాలు గజగజ
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:10 PM
మన్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. శనివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగానే పొగమంచు కురిసింది.
పెరుగుతున్న చలి తీవ్రత!
తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
అరకులోయలో 3.9 డిగ్రీలు
చింతపల్లిలో 4.8డిగ్రీలు
పాడేరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. శనివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగానే పొగమంచు కురిసింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. జనం చలి నుంచి ఉపశమనం పొందేందుకు యాతన పడుతున్నారు. తాజా వాతావరణం పర్యాటకులకు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉండడంతో అరకులోయ, వంజంగి, తాజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది.
సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
మన్యంలో సింగిల్ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో శనివారం కొయ్యూరు, అనంతగిరి మినహా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులోయలో 3.9 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పెదబయలులో 4.7, ముంచంగిపుట్టులో 4.8. జి.మాడుగులలో 4.9, చింతపల్లిలో 6.8, హుకుంపేటలో 7.6, కొయ్యూరులో 12.2, అనంతగిరిలో 14.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లిలో..
గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏక సంఖ్యలో నమోదు కావడంతో ఆదివాసీలు గజగజ వణుకుతున్నారు. శనివారం చింతపల్లిలో 4.8డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది. పర్యాటకులు, స్థానికులు సైతం చలి మంటలకు అతుక్కుపోతున్నారు. కాగా నెలాఖరు వరకు గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ నోడల్ అధికారి తెలిపారు.