గిరిజనుల సమైక్య రాగం
ABN , Publish Date - May 02 , 2026 | 11:15 PM
అది మారుమూల గ్రామం.. కాలిబాటే రహదారి. గ్రామానికి ముందు చిన్న గెడ్డ ఉంది. ఆ పల్లెకు ఏ వాహనం రాదు.. రోగం వస్తే డోలి మోత తప్ప మరో మార్గం లేదు.. మా సమస్యలివీ అంటూ అధికారులు, పాలకులకు ఎన్నో వినతులు ఇచ్చారు. కానీ ఎవరూ కరుణించలేదు.. చివరకు ఓ రెండు ఘటనలు గ్రామస్థులను మేల్కొలిపాయి. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాభర్తలను వేర్వేరు రోజులు తరలిస్తుండగా మృతి చెందారు. గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో కవలలకు జన్మనిచ్చింది. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఒక శిశువు చనిపోయింది. నిండు నూరేళ్లు బతకాలంటే చిన్నపాటి ఆలస్యం కారణంగా సకాలంలో వైద్యం అందక వారు మృతి చెందారని గ్రామస్థులు గ్రహించారు. వారంతా సమావేశమై శ్రమదానం, విరాళాలతో కాలిబాటను గ్రావెల్ రోడ్డుగా మార్చుకున్నారు. ఇప్పుడు గెడ్డపై వంతెనను నిర్మిస్తున్నారు.
రోడ్డు, వంతెన కోసం అధికారులు, పాలకులకు ఎన్నోసార్లు వినతులు
కాళ్లు అరిగేలా తిరిగినా కరుణించని వైనం
సకాలంలో వైద్యం అందక చిన్నారి.. భార్యాభర్తలు వేర్వేరుగా మృతి
ఈ రెండు ఘటనలు తెచ్చిన మార్పు
శ్రమదానం, విరాళాలతో కాలిబాటను గ్రావెల్ రోడ్డుగా..
గెడ్డపై వంతెన నిర్మాణం
మెచ్చగుడ గ్రామస్థుల్లో వెల్లివిరిసిన చైతన్యం
(ఆంధ్రజ్యోతి/అరకులోయ)
మండలంలోని మాడగడ పంచాయతీ మారుమూల గ్రామం మెచ్చగుడ. ఈ గ్రామానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఎప్పుడో వేసిన కాలిబాటే చిన్నపాటి రహదారిలా గ్రామస్థులు శ్రమదానంతో మార్పుకున్నారు. వర్షాకాలంలో ఈ రోడ్డుపై జనం, పశువులు జారిపోతుండడంతో విరాళాలు వేసుకొని గ్రావెల్ వేయించుకుని రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఇంత చేసినా గ్రామానికి వాహనాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కారణమేమింటే.. గ్రామ సమీపాన చిన్న గెడ్డ ఉంది. ఇక బైక్‌లు సాహసంతో తీసుకువెళ్లాలి. ఇటువంటి తరుణంలో గ్రామ పెద్దలు, యువకులు పలు మార్లు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు ఎన్నో పర్యాయాలు వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఆ గ్రామంలో 18 కుటుంబాలున్నాయి. వంద మంది జనాభా ఉంది. మరో విశేషం ఏమిటంటే.. గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే పరామర్శకు వచ్చిన నేత గెడ్డ దాటేందుకు గ్రామస్థులు వేసిన పొడవాటి కర్రలపై సాహసం చేసి నడిచి వెళ్లారు.. కాని గ్రామస్థులు నిత్యం ఎదుర్కొంటున్న వంతెన సమస్యపై ఆ నేత పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా ఏడాది క్రితం వేర్వేరు రోజుల్లో భార్యాభర్తలను ఆసుపత్రికి తీసుకువెళుతుండగానే మృత్యువాత పడ్డారు. అదేవిధంగా నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంతమూరు గ్రామానికి డోలీపై తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మాడగడ పీహెచ్‌సీకి గర్భిణిని తరలిస్తుండగానే మార్గమద్యంలో కవలపిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రికి తరలించగా కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ రెండు సంఘటలు గ్రామస్థులను తీవ్రంగా కలిచివేసింది. ఇలా ఎన్నాళ్లు ప్రాణాలను పోగొట్టుకుంటామని, ఇకపై అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే వంతెనను నిర్మించాలని సంకల్పించారు. దీంతో గ్రామస్థులు ఓ వైపు శ్రమదానంతో పనులు చేస్తునే.. మరోవైపు మెటీరియల్ కోసం విరాళాలు వేసుకొని రూ.నాలుగు లక్షలు సమకూర్చుకొని వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రెండు వైపులా కాంక్రీట్ గోడలను శ్లాబ్ స్థాయికి నిర్మించారు. మరో పది రోజుల్లో బాటం ఫ్లోర్ కాంక్రీట్ వేయనున్నారు. తర్వాత శ్లాబ్ కాంక్రీట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పగలంతా ఉపాధి హామీ పనులకు వెళ్తూ.. సాయంత్రం వేళలో గ్రామస్థులంతా కలిసికట్టుగా వంతెన దగ్గర పనులు చేస్తున్నారు. ఇటీవల మూడు సార్లు సాయంత్రం కాంక్రీట్ పనులు ప్రారంభించి అర్థరాత్రి తర్వాత ఒంటి గంట వరకు చేపట్టామని గ్రామస్థులు తెలిపారు. వంతెన పూర్తయితే గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న వంతమూరు ప్రాథమిక పాఠశాలకు పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయని గ్రామస్థులు అంటున్నారు. ఇలా శ్రమదానం, విరాళాలతో నిర్మించిన వంతెన ప్రారంభానికి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఆహ్వానిస్తామని గ్రామానికి చెందిన కొర్రా సన్యాసిరావు, వంతల రాము, కొర్రా గులాబి తెలిపారు.
కలెక్టర్, పీవో సందర్శించాలి
వంతల రాము, గ్రామస్థుడు, మెచ్చగుడ
గ్రామాన్ని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో సందర్శించాలి. తాము శ్రమదానంతో చేపడుతున్న పనులను పరిశీలించాలి. అవకాశం ఉంటే గ్రామానికి మెటల్‌తో కూడిన రహదారి, వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలి
రూ.లక్షన్నరతో గ్రావెల్ రోడ్డు వేసుకున్నాం
కొర్రా సన్యాసిరావు, గ్రామస్థుడు, మెచ్చగుడ
వంతమూరు నుంచి మెచ్చగుడ గ్రామానికి రెండు కిలోమీటర్ల మేరకు బంకమట్టితో చిన్న బాట ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామంలోని 18 కుటుంబాలు విరాళంగా రూ.లక్షన్నర ఇచ్చాం. ఎక్స్‌కవేటర్, ట్రాక్టర్ల సాయంతో గ్రావెల్ రోడ్డు వేసుకున్నాం. అధికారులు స్పందించి వంతమూరు నుంచి మెచ్చగుడ వరకు తారు రోడ్డును వేయాలి
పాలకులు, అధికారులు పట్టించుకోలేదు
కొర్రా గులాబి, గ్రామ యువతి
మెచ్చగుడ గ్రామానికి రహదారితోపాటు గెడ్డపై చిన్న వంతెన వేయమని ఎన్నో సార్లు వినతులు ఇచ్చాం. పాలకులు, అధికారులు మా విన్నపాలను పట్టించుకోలేదు. బాధ అనిపించింది. ఎవరైతే సమస్యలకు పరిష్కారం చూపాలో వారే పట్టించుకోకపోతే తామంతా ఎవరి వద్దకు వెళ్లాలి అని ప్రశ్నించింది. కలెక్టర్, ఐటీడీఏ పీవో మా గ్రామాన్ని సందర్శించాలి. మా సమస్యలకు పరిష్కారం చూపాలి.