గిరిజన విద్యార్థులు మరో గిన్నిస్ రికార్డు
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:39 PM
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాశ్రయం ప్రారంభోత్సవం పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు చేసిన ధింసా ప్రదర్శన గిన్నిస్ రికార్డు సాధించింది.
తాజాగా భోగాపురంలో 13 వేల మందితో ధింసా ప్రదర్శనకు..
గతేడాది 26 వేల మందితో 108 సూర్య నమస్కారాలకు..
సత్తా చాటుతున్న గిరిజన విద్యార్థులు
(పాడే రు- ఆంధ్రజ్యోతి)
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాశ్రయం ప్రారంభోత్సవం పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు చేసిన ధింసా ప్రదర్శన గిన్నిస్ రికార్డు సాధించింది. దీంతో గిరిజన విద్యార్థుల ఖాతాల్లో రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. గతేడాది జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ యోగాదినోత్సవాల్లో జిల్లాకు చెందిన 26 వేల మంది గిరిజన విద్యార్థులు 108 సూర్యనమస్కారాల ప్రదర్శన చేపట్టి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు. అప్పట్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆగస్టు ఒకటిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి 13 వేల మంది గిరిజన బాలికలతో ధింసా ప్రదర్శనతో ఘన స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో ఏడు వేల మంది విద్యార్థులు అల్లూరి జిల్లాకు చెందివారే. ఈక్రమంలో శుక్రవారం భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు చేసిన ధింసా నృత్య ప్రదర్శన సైతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా నమోదైంది. గిరిజన విద్యార్థులు రెండు గిన్నిస్ రికార్డులు సాధించడంపై జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, తదితరులు ఆనందం వ్యక్తంచేశారు.