Share News

మలేరియాతో గిరిజన విద్యార్థి మృతి

ABN , Publish Date - May 09 , 2026 | 10:38 PM

మండలంలోని అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి మలేరియాతో మృతి చెందాడు.

మలేరియాతో గిరిజన విద్యార్థి మృతి
మలేరియాతో మృతి చెందిన గిరిజన విద్యార్థి దయాకర్‌(ఫైల్‌)

చింతపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి మలేరియాతో మృతి చెందాడు. మృతుడు తండ్రి కిముడు సింహాచలం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగవరం గ్రామానికి చెందిన కిముడు దయాకర్‌(15) అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో ఓ ప్రైవేటు పాఠశాలలో పది పరీక్షలు రాసి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. సెలవులు కావడంతో విద్యార్థి ఇంట్లో ఉన్నాడు. రెండు రోజుల క్రితం విద్యార్థికి జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులు బాలుడికి మందులు వేసినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం లంబసింగి పీహెచ్‌సీకి తీసుకు వెళ్లారు. ఆస్పత్రిలో విద్యార్థికి రక్త పరీక్ష నిర్వహించగా.. మలేరియా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి దినేశ్‌ తెలియజేశారు. ఆస్పత్రిలో మలేరియా నివారణ మందులేవని, ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాలని చీటిపై వైద్యాధికారి రాసి ఇంటికి పంపించేశారు. మెడికల్‌ షాపులో మందులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిపోయిన కుటుంబ సభ్యులు మధ్యాహ్నం బాలుడుకి ఒక మాత్ర పట్టారు. కొంత సమయానికి విద్యార్థి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆటో తాజంగి పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో పంపించారు. రాత్రి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి వచ్చిన విద్యార్థిని పరీక్షించిన వైద్యాధికారి లావణ్య బాలుడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. కాగా లంబసింగి వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు మృతి చెందాడని, బాలుడికి మలేరియా పాజిటివ్‌ రావడంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే చింతపల్లి ఏరియా ఆస్పత్రికి పంపించి ఉంటే తన బిడ్డకు సకాలంలో వైద్యం అందేదని, ప్రాణపాయం తప్పేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

Updated Date - May 09 , 2026 | 10:38 PM