వణికిన గిరిజనం
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:02 AM
మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ పీచుమామిడిలో శనివారం ఉదయం జరిగిన పేలుడుకు సమీపంలోని ఇళ్ల గోడలు, పైకప్పు రేకులు దెబ్బతిన్నాయి.
పీచుమామిడిలో శనివారం పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇళ్ల గోడలు, పైకప్పు రేకులు
ఘటన జరిగిన సమయంలో పొలం పనుల్లో నిమగ్నం
పెద్ద శబ్దం రావడంతో పరుగున ఇళ్లకు..
అక్కడి పరిస్థితిని చూసి భయాందోళన
తాజాగా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో టెన్షన్
అనంతగిరి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ పీచుమామిడిలో శనివారం ఉదయం జరిగిన పేలుడుకు సమీపంలోని ఇళ్ల గోడలు, పైకప్పు రేకులు దెబ్బతిన్నాయి. పీచుమామిడి గ్రామ సమీపాన ఒక వాహనం పైనున్న డ్రమ్ము నుంచి వేరొక వాహనంలోకి డీజిల్ పంపింగ్ చేస్తుండగా సంభవించిన పేలుడులో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పీచుమామిడి గ్రామంలో 14 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరంతా శనివారం ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. భారీ శబ్దం రావడంతో వీరంతా పరుగున ఇళ్లకు చేరుకున్నారు. చెల్లాచెదురైన మృతదేహాలు, రోడ్డుపై పడి ఉన్న మాంసపు ముద్దలను చూసి భయాందోళన చెందారు. పేలుడు ధాటికి ఇళ్ల గోడలు, పైకప్పు రేకులు దెబ్బతినడంతో వీరంతా నీడను కోల్పోయారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న చర్చి గోడలు బీటలువారగా, పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఈ ప్రమాదం ఆదివారం జరిగి ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని గ్రామస్థులు చెబుతున్నారు.
తుఫాన్ హెచ్చరికతో కలవరం
పీచుమామిడి గ్రామంలో చింత నాగేశ్వరరావు, చింత పొట్టన్న, గెమ్మెల బాలరాజు, చింత గంగమ్మ, కొర్రా బాబూరావు, కొర్రా జమ్ములు, కొర్రా పొట్టన్న, కొర్రా మల్లన్న, గెమ్మెల జమ్ములు, కొర్రా బాలన్న, గెమ్మెల దేముడు, వెంకట లక్ష్మయ్య, తామర్ల మల్లమ్మ, గెమ్మల మల్లిబాబు కుటుంబాలు నివాసముంటున్నాయి. పేలుడు ధాటికి వీరి ఇళ్ల పైకప్పు రేకులు దెబ్బతినడం, గోడలు బీటలువారడంతో ఆవేదన చెందుతున్నారు. తాజాగా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ఇళ్లల్లో ఎలా ఉండాలని ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.