Share News

ట్రైబల్‌ మ్యూజియం.. కళావిహీనం

ABN , Publish Date - May 14 , 2026 | 11:25 PM

అరకులోయ నడిబొడ్డున ఉన్న ట్రైబల్‌ మ్యూజియం కళావిహీనంగా మారింది. ఆదాయం కోట్ల రూపాయాల్లో వస్తున్నా ఐటీడీఏ యంత్రాంగం గాలికొదిలేసింది. కళాగ్రామంలో ప్రతిమలు, బోటుషికారు, స్కై సైక్లింగ్‌, జిప్‌లైనర్‌, అడ్వంచర్‌ యాక్టివిటీ, చిల్డ్రన్‌పార్కులు వంటివి పర్యాటకులకు అలరించే పరిస్థితి లేకుండా పోయింది.

ట్రైబల్‌ మ్యూజియం.. కళావిహీనం
రంగు వెలసిన ప్రతిమలు

కోట్లు ఆదాయం వస్తున్నా గాలికొదిలేసిన ఐటీడీఏ

అడ్వంచర్స్‌ అలంకారప్రాయం

మూలకు చేరిన మరుగుదొడ్లు

కళ తప్పిన కళాగ్రామం ప్రతిమలు

బోసిపోయిన గిరిజనబజార్‌

పర్యవేక్షణ శూన్యం.. పర్యాటకులకు శాపం

అరకులోయ, మే 14 (ఆంధ్రజ్యోతి): అరకులోయ పట్టణంలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గిరిజన మ్యూజియం నిర్వహణ అధ్వానంగా ఉంది. దీనిని పర్యవేక్షించాల్సిన ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. మ్యూజియం ప్రవేశద్వారం నుంచి లోపలకు వచ్చేసరికి కళాగ్రామం, గిరిజన్‌ బజార్‌, మూఠాదార్‌ హౌస్‌, ఫొటోగ్యాలరీ, సీడ్స్‌ గ్యాలరీ, అగ్రికల్చర్‌ గ్యాలరీ, బోటుషికారు, స్కై సైక్లింగ్‌, జిప్‌లైనర్‌, అడ్వంచర్‌ యాక్టివిట్సీ, చిల్డ్రన్‌ పార్కు ఇలా అన్నీ పాడైపోయాయి. మ్యూజియం ప్రవేశ రుసుం (ఎంట్రీ ఫీజు) పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30 వసూలు చేస్తుండగా, లోపల కళాగ్రామంలో ఉన్న బోటుషికారుకు, అడ్వంచర్‌ యాక్టివిటీస్‌లో పాల్గొంటే.. వాటికి వేరే రేట్లు వసూలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అన్ని యాక్టివిట్సీ పర్యాటకులకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళుతున్నారు. మూజియం లోపలకు వచ్చిన వెంటనే ఉన్న కళాగ్రామం నిర్వహణ లోపించింది. ఇక్కడ ప్రతిమలన్నీ రంగులు వెలిసిపోయాయి. పర్యాటకులు ఫొటోలు దిగేందుకు వీలుగా ఐరన్‌తో ఏర్పాటుచేసిన పలురకాల ఆకృతులన్నీ తుప్పుపట్టాయి. గిరిజన సంస్కృతి-సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఏర్పాటుచేసిన పలురకాల ప్రతిమల రూపరేఖలు మారిపోయాయి. పలు ప్రతిమలు విరిగిపోయి పర్యాటకులు చూసేందుకే ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాగే బోటుషికారుకు సంబంధించిన కొలనులో ఎండ వేడిమికి నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. దీంతో బోటింగ్‌ చేసేందుకు వీలు లేకుండా ఉంది. అంతేకాకుండా కొలనులో నీరు బాగా పాడైపోయి చిన్నపాటి దుర్గంధం వస్తున్నట్టు పలువురు పర్యాటకులు తెలిపారు. బోటుషికారుకు అనువైన బోట్లు లేవు. అలాగే అడ్వంచర్‌ యాక్టివిటీస్‌లో భాగంగా ఏర్పాటుచేసిన స్కై సైక్లింగ్‌, జిప్‌లైనర్‌ మూసివేశారు. కమెండో నెట్‌, పిరమిడ్‌వాక్‌, బర్మా బ్రిడ్జి, వాల్‌ క్లైంబింగ్‌, లేడర్‌వాక్‌ వంటి యాక్టివిటీలన్నీ మూసివేశారు. అవన్నీ అలంకారప్రాయంగా ఉన్నాయి.

గిరిజన మూజియంలో 20 వరకు మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిని సనా అనే స్వచ్ఛంద సంస్థ ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వీటి నిర్వహణ సక్రమంగా లేదు. ఏ ఒక్క టాయిలెట్ల ప్లస్‌ ట్యాంకులు పనిచేయవు. డోర్స్‌, కమోడ్స్‌ పాడైపోయాయి. మహిళల టాయ్‌లెట్‌కు తలుపే లేకపోవడం గమనార్హం. అలాగే తాగునీటి కోసం ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్‌ మూలకు చేరింది. చిన్న పిల్లలు ఆటలాడే పరికరాలన్నీ పాడైపోయాయి. రంగులన్నీ వెలిసిపోవడంతోపాటు తుప్పు పట్టి ఉన్నాయి. పర్యాటకులను కనువిందు చేయాల్సిన మ్యూజియం అలంకారప్రాయంగా మారింది. దీంతో పర్యాటకులు టిక్కెట్‌ తీసుకొని లోపలకు వెళ్లి వస్తూ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గిరిజన బజార్‌ బోసిపోయింది. అక్కడ అటవీ ఉత్పత్తులు, మిల్లెట్స్‌ తదితరాలు ఏవీ కానరావడం లేదు. గిరిజనులు తయారు చేసే వస్తువులు లేకుండా ఇతర ప్రాంతాలు,రాష్ట్రాలకు చెందిన వస్తువులను ఇక్కడ విక్రయిస్తున్నారు.

ఏటా రూ.3 కోట్లు పైనే ఆదాయం

ట్రైబల్‌ మ్యూజియం ద్వారా ఐటీడీఏకు ఏటా మూడు నుంచి మూడున్నర కోట్ల రూపాయుల ఆదాయం టికెట్‌ రూపంలో సమకూరుతున్నది. ఇక్కడ పనిచేసే సిబ్బంది జీతభత్యాలు, కరెంట్‌బిల్స్‌, ఇతర నిర్వహణ ఖర్చులకు కోటి రూపాయలు పోయినా రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు ఐటీడీఏకు ఆదాయంగా వస్తున్నది. అయినప్పటికీ మూజియం నిర్వహణ అధ్వానంగా తయారైంది. సందర్శకులకు అలరించే విధంగా.. ఆకట్టుకొనేలా మూజియాన్ని సిద్ధం చేయకుండా ఐటీడీఏ యంత్రాంగం గాలికి వదిలేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ముందుకొస్తుంటే ఐటీడీఏ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంపై పర్యాటకులు మండిపడుతున్నారు. అరకులోయలోని సందర్శిత ప్రాంతాల అభివృద్ధిపై ఐటీడీఏ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Updated Date - May 14 , 2026 | 11:25 PM