రోడ్డు ప్రమాదంలో గిరిజనుడి మృతి
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:11 PM
మండలంలోని పెదమాకవరం-రామరాజుపాలెం గ్రామాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో పెదమాకవరానికి చెందిన సాగిన రాంబాబు (60) మృతిచెందాడు.
మరొకరికి తీవ్ర గాయాలు
విశాఖ కేజీహెచ్‌కు తరలింపు
కొయ్యూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని పెదమాకవరం-రామరాజుపాలెం గ్రామాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో పెదమాకవరానికి చెందిన సాగిన రాంబాబు (60) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన శరభన్నపాలెంకు చెందిన బొండా లోవసాయి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మ అందజేసిన వివరాలిలా ఉన్నాయి.
కనుమ పండగ సందర్భంగా శరభన్నపాలెం నుంచి కొండకించంగి గిరీష్, లోవసాయి కలిసి ద్విచక్ర వాహనంపై కృష్ణాదేవిపేట వైపు వస్తుండగా.. రామరాజుపాలెంకు సమీపంలో నడిచి వెళుతున్న రాంబాబును ఢీకొట్టారు. ఈ ఘటనలో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లోవసాయి తుళ్లి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. గాయపడిన వ్యక్తిని వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి మేనల్లుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ కిశోర్‌వర్మ తెలిపారు.