Share News

చాపరాయిలో గిరిజనుడి మృతి

ABN , Publish Date - May 23 , 2026 | 12:13 AM

డుంబ్రిగుడ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహరి సమీపంలోని హనుమరాయి గెడ్డలో సరదాగా స్నానానికి దిగి గిరిజనుడు శుక్రవారం మృతి చెందాడు.

చాపరాయిలో గిరిజనుడి మృతి
మృతుడు సోంబ్రు(42)

స్నానానికి దిగి గల్లంతు

మృతదేహాన్ని వెలికితీసిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం

డుంబ్రిగుడ, మే 22 (ఆంధ్రజ్యోతి): డుంబ్రిగుడ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహరి సమీపంలోని హనుమరాయి గెడ్డలో సరదాగా స్నానానికి దిగి గిరిజనుడు శుక్రవారం మృతి చెందాడు. బాధిత గిరిజనుడి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని పోతంగి పంచాయతీ అంత్రిగుడ గ్రామానికి చెందిన కొర్రా సోంబ్రు (42) అనే గిరిజనుడి స్థానిక మండల కేంద్రంలోని ఓ చికెన్‌ దుకాణంలో రోజు వారి కూలిగా పనిచేస్తున్నాడు. దుకాణంలో పనిచేసిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలోని చాపరాయి గెడ్డకు ఆనుకుని ఉన్న హనుమరాయిలో స్నానం చేసేందుకు దిగడాన్ని జలవిహరిలో పనిచేస్తున్న సిబ్బంది గమనించారు. సిబ్బంది వారించేలోపు ఆయన హఠాత్తుగా జారిపడి గెడ్డలో గల్లంతయ్యారు. జలవిహరి సిబ్బందితోపాటు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఈతగాళ్లతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని వెలికి తీశారు. సంఘటన స్థలంలో బాధిత గిరిజనుడి కుటుంబీకులు మృతదేహన్ని చూసి భోరుమన్నారు. బాధిత గిరిజనుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, వికలాంగురాలైన భార్య ఉన్నారు. పోస్టుమార్టం మృతదేహన్ని అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 12:13 AM