Share News

పిడుగుపాటుతో గిరిజనుడి మృతి

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:18 AM

మండలంలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు ఒక గిరిజనుడి మృతి చెందాడు.

పిడుగుపాటుతో గిరిజనుడి మృతి
మృతి చెందిన గెమ్మెలి భాస్కరరావు

ఈదురుగాలుల బీభ త్సంతో వణుకూరులో రెండిళ్లు, పాఠశాల రేకులు ధ్వంసం

జి.మాడుగుల, మార్చి 30(ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు ఒక గిరిజనుడి మృతి చెందాడు. మండలంలో సొలభం పంచాయతీ బీమలోయ గ్రామానికి చెందిన గెమ్మెలి భాస్కరావు, వంతాల చిన్నారావు, గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం పశువులను మేపుతున్నారు. ఈ క్రమంలో వారికి సమీపంలోనే పిడుగు పడడంతో గెమ్మెలి భాస్కరావుకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందగా, చిన్నారావు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో బీమలోయ గ్రామంలో విషాదం అలముకుంది. మృతుడు భాస్కరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వణుకూరులో ఈదురుగాలుల బీభత్సం

మండలంలో బొయితిలి పంచాయతీ వణుకూరులో సోమవారం ఈదురు గాలలు బీభత్సవం సృష్టించాయి. భారీ ఈదురు గాలులకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పైకప్పు రేకులు ఎగిరిపోయారు. అయితే ప్రస్తుతం ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు తెలిపారు. అలాగే తెరవాడ సూరిబాబు, గూడ నీలమ్మలకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు భారీ ఈదురుగాలులకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎంపీపీ అప్పలరాజు, సర్పంచ్‌ మాలన్న, మాజీ సర్పంచ్‌ రాంబాబు వణుకూరు వెళ్లి బాధితులను పరామర్శించారు.

Updated Date - Mar 31 , 2026 | 12:18 AM