గిరి రైతులకు పథకాలు అందాలి
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:19 PM
జిల్లాలో గిరిజన రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ నిషాంతి ఆదేశం
పంటల బీమా ప్రక్రియను వేగవంతం చేయండి
ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని స్పష్టీకరణ
రైతులకు ఎల్‌నినోపై అవగాహన కల్పించండి
పాడేరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. వ్యవసాయానుబంధ రంగాలకు చెందిన అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా గిరి రైతులు పంటలకు బీమా సదుపాయాన్ని కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులైన రైతులకు అందించాలన్నారు. అర్హత కలిగిన ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, అవకాశం ఉన్న మేరకు రైతులకు మేలు చేసేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. తాజా వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించి, వారికి అనుకూలంగా ఉండే పంటల సాగుపై దృష్టిసారించేలా సూచనలు, సలహాలు అందించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లోని పంటల స్థితిగతులు, ఎరువుల లభ్యత, తదితర అంశాలపై కలెక్టర్ నిషాంతి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, జిల్లా పట్టుపరిశ్రమ అధికారి అప్పారావు, మైక్రో ఇరిగేషన్ పీడీ రహామ్, కాఫీ బోర్డు ఎస్‌ఎల్‌వో రమేశ్, స్పైసెస్ బోర్డు ఫీల్డ్ అధికారి బి.కల్యాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.