ఆర్గానిక్ జోన్‌గా గిరిజన ప్రాంతం
ABN , Publish Date - May 19 , 2026 | 12:08 AM
గిరిజన ప్రాంతాన్ని ఆర్గానిక్ జోన్‌గా తీర్చిదిద్దేందుకు పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
పంటలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుకు ప్రణాళిక
బ్లాక్ రైస్ సాగుకు ప్రోత్సాహం
రాగి, సామ, కొమ్ముశనగలో మేలిరకం వంగడాలు
మినీ కిట్స్ రూపంలో రైతులకు పంపిణీ
ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి
చింతపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాన్ని ఆర్గానిక్ జోన్‌గా తీర్చిదిద్దేందుకు పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్గానిక్ ఉత్పత్తులు సాగు చేసేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా అనువైన ప్రాంతమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ గిరిజన ప్రాంతంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నదన్నారు. రైతులు గతంలో పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేవారని, కాలక్రమేణా రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ఆకర్షితులయ్యారు. ఈ సాగు విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం విశిష్ట కృషి చేస్తుందన్నారు. ఖరీఫ్, రబీలో పండించే పంటలు విత్తనం నాటినప్పటి నుంచి పంట కోసే వరకు సేంద్రీయ పద్ధతులను పాటించేందుకు శాస్త్రవేత్తలు పూర్తి సాంకేతిక సహకారం అందిస్తారన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులను దూరం చేసి, జీవ నియంత్రణ ఎరువులు, పురుగు మందులను రైతులకు పరిచయం చేయనున్నామని ఆయన చెప్పారు. అలాగే నూతనంగా నియమితులైన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ గిరిజనుల వ్యవసాయ ప్రగతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో కురుస్తున్న అధిక వర్షాలు, సహజ జలాలను సద్వినియోగం చేసుకుంటూ పండించేందుకు అనువైన పంటలు, సాగు విధానంపై అధ్యయనం చేసేందుకు ఉపకులపతి ఆదేశాలతో శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రాజెక్టు రూపకల్ప చేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న స్వభావం కలిగిన నేలలు ఉన్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఉన్న నేలలు, సాగుకు అనుకూలమైన పంటలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.
బ్లాక్ రైస్ సాగుకు ప్రోత్సాహం
వరిలో బ్లాక్ రైస్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. గిరిజన రైతులు ఆర్గానిక్ పద్ధతిలో బ్లాక్ రైస్ సాగు చేస్తే మంచి ధర లభిస్తుందన్నారు. గిరిజన ప్రాంతానికి అనువైన బాక్ రైస్ బీపీటీ 2841 రకం విత్తనాలను అభ్యుదయ రైతులకు చిరు సంచుల్లో పంపిణీ చేస్తామని చెప్పారు. బ్లాక్ రైస్‌ని సేంద్రీయ పద్ధతిలో సాగు చేసేందుకు ప్రోత్సహిస్తామన్నారు. రానున్న మూడేళ్లలో గిరిజన ప్రాంతంలో బ్లాక్ రైస్ సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. బ్లాక్ రైస్ సాగు ద్వారా రైతులకు మంచి ఆదాయం సమకూరుతుందని తెలిపారు.
రాగి, సామ మేలిరకం వంగడాలు
గిరిజన ప్రాంత రైతులు కొన్నేళ్లగా రాగి, సామ పంటల్లో దేశవాళీ వంగడాలను సాగు చేసుకుంటున్నారన్నారు. దీంతో రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు పొందలేకపోతున్నారని తెలిపారు. ఈ మేరకు తాజాగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన, సలహా మండలి(జెడ్‌ఆర్‌ఈసీ) సమావేశంలో శాస్త్రవేత్తలు గిరిజన రైతులకు మేలిరకం వంగడాలను అందించాలని నిర్ణయించారన్నారు. రానున్న ఖరీఫ్‌లో ఐదేళ్లలోపు విడుదలైన విత్తనాలను రైతులకు మినీ కిట్స్ రూపంలో అందజేస్తామన్నారు. ప్రధానంగా రాగిలో పీపీఆర్ 1216, సామలో వీఎస్ 57 పంపిణీకి విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుందన్నారు. గిరిజన రైతులు వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల సహకారంతో వ్యవసాయ ప్రగతి సాధించాలని ఆయన సూచించారు.