బిక్కుబిక్కుమంటూ!
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:08 AM
ఇరాన్‌పై అమెరికా దాడితో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గల్ఫ్ దేశాల్లో ప్రవాసీయుల ఆందోళన
ఇరాన్ దాడులతో భయం భయం
ఖతార్, దుబాయ్, కువైట్‌లో జిల్లా వాసులు
బాంబుల మోతతో ప్రవాసుల్లో తీవ్ర ఆందోళన
బయటకు వెళ్లొద్దని ఆయా దేశాల ప్రభుత్వాల సూచన
విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):
ఇరాన్‌పై అమెరికా దాడితో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడంతో ప్రతిగా ఇరాన్ భారీ దాడులకు దిగింది. అమెరికా బేస్ క్యాంపులు, మిత్రదేశాలపై ఇరాన్ మిసైల్స్‌తో విరుచుకుపడుతోంది. ఇప్పటికే దోహా, బెహ్రయిన్, ఖతార్, యూఏఈ, కువైట్, జోర్డాన్, దుబాయ్ తదితర దేశాల్లోని అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ దాడులు చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వెళ్లిన జిల్లా వాసులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని జిల్లా కు చెందిన పలువురు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో వివరించారు. ఇల్లు వదిలి బయటకు రావద్దన్న ప్రభుత్వాల సూచనలు పాటిస్తున్నామన్నారు. ఖతార్‌లో ఉద్యోగులకు ఆయా కంపెనాలు వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వగా, పది, ఇంటర్ విద్యార్థులకు జరుగు తున్న సీబీఎస్‌సీ పరీక్షలను అక్కడి ప్రభుత్వం వాయిదా వేసినట్టు తెలిపారు.
పరిస్థితులపై ఆరా
ఆయా దేశాల్లో పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ విశాఖ సీని యర్ నాయకుడు వి.మూర్తియాదవ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలశాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎవరూ కంగా రు పడాల్సిన అవసరం లేదని, నిత్యం సమీక్షిస్తున్నామని మంత్రి చెప్పారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షిస్తోందని, ప్రవాసుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి హామీ ఇచ్చారన్నారు. మూర్తియాదవ్ కుమారుడు దుబాయ్‌లో ఉండడంతో ఆయన ఆందోళన చెందు తున్నారు. విశాఖకు చెందిన వందల మంది ఉద్యోగాలు, వ్యాపా రాల నిమిత్తం గల్ఫ్ దేశాల్లో నివస్తున్నారు.
ఇంటికే పరిమితమయ్యాం
ఖతార్‌లోని ఆల్కోర్‌లో ఉంటున్నాం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుమారు 30 వేల మంది ఉన్నారు. గత రాత్రి నుంచి ఆల్కోర్ చుట్టుపక్కల భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేస్ క్యాంపులపై దాడులు జరుగుతున్నా యంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మినహా బయటకు రావద్దని సూచించింది. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు ప్రారంభించారు. పది, ఇంటర్ సీబీఎస్‌సీ పరీక్షలను వాయిదా వేశారు. పెద్ద కంపెనీలు ఉద్యో గులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. తప్పుడు మెసేజ్‌లతో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ సూచనలను పాటించాలని భారత ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేదు. పెద్దషాపులు 24 గంటలు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. గ్రూపుల్లో ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాం. భయాందోళన పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వ చర్యలతో కాస్త ఉపశమనం దక్కింది.
- ఉసిరికల రాజా రమాపద్మజ, ఖతార్ తెలుగు అసోసియేషన్ అడ్వైజరీ సభ్యురాలు
ఇంటికి దగ్గరలోనే బాంబులు
దుబాయ్‌లో గత రాత్రి నుంచి దాడులు జరుగుతున్నాయి. ఇంటికి సమీపంలోనే బాంబులు పడుతుండడంతో భయాందోళన చెందుతున్నాం. విపరీతమైన శబ్దాలు, దుర్వాసన వెలువడుతోంది. ప్రస్తుతానికి విద్యుత్, నీరు, ఆహారానికి ఇబ్బందులు లేవు. ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి. కానీ, ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియడం లేదు. ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. కొద్దిసేపటి క్రితం ఇంటికి సమీపంలోనే పెద్ద బాంబు పడిన శబ్దం వచ్చింది. బయటి నుంచి తెప్పించుకునే పార్సిల్స్‌కు బ్రేక్ పడింది.
- బి.జయసూర్య, సీనియర్ డిజైనర్ ఏ1 టైర్ కంపెనీ, దుబాయ్
యుద్ధ విమానాలతో ఆందోళన
ఇక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మేమున్న ప్రాంతానికి కొద్దిదూరంలో బాంబులు పడిన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎయిర్‌జెట్‌లు, యుద్ధవిమానాలు శరవేగంగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఆహారానికి, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేవు. బయటకు రావద్దని అధికారులు ఆదేశాలిచ్చారు. రూములకే పరిమితమయ్యాం. ఏం జరుగుతుందో తెలియడం లేదు. భారత ప్రభుత్వం ఇక్కడి అధికారులతో మాట్లాడిందని చెబుతున్నారు. సుమారు పది వేల మంది ప్రవాస భారతీయులమున్నాం.
- కలిశెట్టి గణేష్, అబుదాబి, రుయాస్
1జిపిటి13: సౌదీలో గోపాలపట్నం వాసులు పల్లా నూకరాజు, రామ్మూర్తి
కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు
సౌదీ అరేబియాలోని రబీగ్ ప్రాంతంలో పెట్రో కెమికల్ కంపెనీ లో పనిచేస్తున్నాం. ఇరాన్‌పై దాడుల నేపఽథ్యంలో కొన్నిచోట్ల నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గగనతలం మూసివేత కారణంగా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న వారు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ప్రస్తుతం అవకాశం లేదు. మేమంతా సురక్షితంగానే ఉన్నాం. విధులకు కూడా హాజరవుతున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు.
- పల్లా నూకరాజు, వెంకటాపురం, రామ్మూర్తి, గోపాలపట్నం