Share News

ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో డయాబెటిక్‌ రెటినోపతికి చికిత్స

ABN , Publish Date - Jun 11 , 2026 | 01:10 AM

కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి రీజనల్‌ ఐ హాస్పిటల్‌ (ప్రాంతీయ కంటి ఆస్పత్రి)లో ఉచితంగా ఖరీదైన ఇంజెక్షన్‌ ఇస్తున్నారు. వృద్ధాప్యం, మధుమేహం కారణంగా కీలకమైన రెటీనా రక్తనాళాలు దెబ్బతింటే శాశ్వతంగా అంధులయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల రెటీనా రక్తనాళాల్లో సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి, సకాలంలో వైద్య సేవలు పొందడం అత్యంత కీలకం. ఇందుకోసం రామాటాకీస్‌ సమీపంలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ప్రత్యేకంగా డయాబెటిక్‌ రెటినోపతి పేరుతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో  డయాబెటిక్‌ రెటినోపతికి  చికిత్స

ఉచితంగా రూ.13 వేల విలువైన ఇంజెక్షన్‌

ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద అందజేత

నెలకు సుమారు వంద మందికి అందిస్తున్న వైద్యులు

ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు

విశాఖపట్నం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి):

కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి రీజనల్‌ ఐ హాస్పిటల్‌ (ప్రాంతీయ కంటి ఆస్పత్రి)లో ఉచితంగా ఖరీదైన ఇంజెక్షన్‌ ఇస్తున్నారు. వృద్ధాప్యం, మధుమేహం కారణంగా కీలకమైన రెటీనా రక్తనాళాలు దెబ్బతింటే శాశ్వతంగా అంధులయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల రెటీనా రక్తనాళాల్లో సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి, సకాలంలో వైద్య సేవలు పొందడం అత్యంత కీలకం. ఇందుకోసం రామాటాకీస్‌ సమీపంలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ప్రత్యేకంగా డయాబెటిక్‌ రెటినోపతి పేరుతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మధుమేహం వల్ల కంటి రెటీనా దెబ్బతిన్న వారికి, రెటీనా మధ్య భాగంలో వాపు వచ్చిన వారికి, ఇతర రక్తనాళాల పెరుగుదల, రెటీనా వాపు, కొన్ని కంటి వ్యాధులతో బాధపడేవారికి ఖరీదైన ఇంజెక్షన్‌ ఇస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్‌ను కంటి లోపల ఇస్తారు. ఈ ఇంజెక్షన్‌ రక్తనాళాల పెరుగుదలను, వాపును తగ్గిస్తుంది. ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడానికి అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. కంట్లో మత్తు చుక్కలు వేసి, అనంతరం ఇంజెక్షన్‌ చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. కొన్ని కేసుల్లో ఒకేసారి కాకుండా రెండు, మూడుసార్లు కొన్ని వారాలు కాల వ్యవధి తరువాత తీసుకోవాల్సి ఉంటుంది.

ఖరీదైన ఇంజెక్షన్‌

ఈ ఇంజెక్షన్‌కు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అయితే కనీసం రూ.30 వేలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల రూ.50 వేల వరకు వసూలు చేస్తుంటారు. అయితే, ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకంలో ఉచితంగా ఈ ఇంజెక్షన్‌ను ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఉచితంగా ఇస్తున్నారు. దీని ధర రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంటుంది. అయితే, ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ ప్రాంతీయ కంటి ఆస్పత్రికి సరఫరా చేస్తోంది. ప్రతినెలా ఆస్పత్రిలో 100 మందికిపైగా ఈ ఇంజెక్షన్‌ ఇస్తుంటారు. ఈ ఇంజెక్షన్లు ఇవ్వడానికి రోజుకు కనీసం ఐదుగురిని ఎంపిక చేస్తుంటారు. ఈ ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల చూపు మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. రెటీనా వాపును తగ్గించడంతోపాటు చూపు మెరుగుపడుతుంది. షుగర్‌, ఇతర కారణాల వల్ల చూపు పూర్తిగా దెబ్బతినకుండా కాపాడేందుకు ఈ ఇంజెక్షన్‌ దోహదం చేస్తుంది.

Updated Date - Jun 11 , 2026 | 01:10 AM