హైవేపై ప్రయాణమంటే టెన్షన్
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:31 PM
జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంతో రాకపోకలు సజావుగా సాగుతున్నాయన్న ఆనందం ఒక వైపు, తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఆందోళన మరో వైపు వాహనచోదకుల్లో నెలకొంది.
యథేచ్ఛగా పశువుల సంచారం
వేగంగా వాహనాల రాకపోకలు
కాకరపాడు నుంచి రొంపులఘాట్ వరకు తరచూ ప్రమాదాలు
వేగ నియంత్రణ, పశువుల సంచారం నివారణకు చర్యలు శూన్యం
కొయ్యూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంతో రాకపోకలు సజావుగా సాగుతున్నాయన్న ఆనందం ఒక వైపు, తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఆందోళన మరో వైపు వాహనచోదకుల్లో నెలకొంది. జాతీయ రహదారిపై వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడంతో పాటు పశువుల మందలు యథేచ్ఛగా తిరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మించిన జాతీయ రహదారి మండలంలో కాకరపాడు వద్ద ప్రారంభమై గూడెంకొత్తవీధి మండలం రొంపుల ఘాట్‌లో ఉన్న చిన కాట్రగెడ్డతో ముగుస్తుంది. సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న ఈ జాతీయ రహదారిలో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. 2024 సెప్టెంబరు 29న రావణాపల్లి సమీపంలో రోడ్డుపై తిష్ఠ వేసిన పశువుల మందను తప్పించే క్రమంలో కారు రాంగ్‌రూట్‌లో వెళ్లి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రాజేంద్రపాలేనికి చెందిన అంబటి అప్పన్న, యాదగిరి రాజబాబు మృతి చెందారు. అలాగే 2025 సెప్టెంబరులో శింగవరానికి చెందిన పాంగి అఖిల్.. పిట్టచలం సమీపంలో అతివేగంతో ద్విచక్ర వాహనంపై వస్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి మృతి చెందాడు. 2026 జనవరి 17న రామరాజుపాలెం వద్ద అతివేగంగా ద్విచక్ర వాహనంపై వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై సాగిన రాంబాబు మృతి చెందాడు. 2026 ఫిబ్రవరి 26న ద్విచక్ర వాహనంపై వెళుతున్న పాస్టరు చింతలపూడి వద్ద పశువుల మందను ఢీకొని తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 1న ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ రామరాజుపాలెం టోల్‌గేటు వద్ద అదుపుతప్పి విద్యుతు స్తంభాన్ని ఢీకొని వలసంపేటకు చెందిన చదల గణేశ్ దుర్మరణం చెందాడు. అదే రోజు చింతాలమ్మ ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ ఉద్యోగితో పాటు ఆయన కుమారుడు గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఇలా ఈ జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. ఇక శరభన్నపాలెం సమీప నడింపాలెం నుంచి కాకరపాడు వరకు గల గ్రామాల రైతులు తమ పశువులను రోడ్డుపై విడిచిపెడుతున్నారు. దీంతో పశువులు పగటి పూట మేసి రాత్రి వేళ జాతీయ రహదారిపై సేదతీరుతున్నాయి. రాత్రి వేళ వీటిని గమనించని వాహనచోదకులు వేగంగా వస్తూ వాటిని ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జాతీయ రహదారిపై వాహనాల వేగ నియంత్రణతో పాటు పశువుల మంద రోడ్డుపై తిరగకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.