Share News

హైవేపై ప్రయాణమంటే హడల్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:11 AM

జాతీయ రహదారి 516-ఈపై ప్రయాణమంటే వాహనచోదకులు హడలిపోతున్నారు. ముఖ్యంగా మండలంలోని అంత్రిగుడ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

హైవేపై ప్రయాణమంటే హడల్‌
అంత్రిగుడ మలుపు వద్ద ఈ నెల 13న ప్రమాదానికి గురైన యువకుడు

మండలంలోని అంత్రిగుడ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు

బాధితుల్లో పర్యాటకులే అధికం

ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టాలని పలువురి వేడుకోలు

డుంబ్రిగుడ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈపై ప్రయాణమంటే వాహనచోదకులు హడలిపోతున్నారు. ముఖ్యంగా మండలంలోని అంత్రిగుడ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పర్యాటకులకు ఈ మార్గంపై అవగాహన లేకపోవడంతో వేగంగా వస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.

పర్యాటకులు అరకులోయలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తరువాత చాపరాయి జలవిహారికి వస్తుంటారు. దీంతో జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. మండలంలోని అంత్రిగుడ వద్ద ప్రమాదకర మలుపు ఉండడంతో ఈ మార్గంపై అవగాహన లేని పర్యాటకులు వేగంగా వస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత నెల 24న రెండు ద్విచక్ర వాహనాలు ఈ మలుపు వద్ద ఢీకొనడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 13న రెండు ద్విచక్ర వాహనాలు ఈ మలుపు వద్ద ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో ఇదే మలుపు వద్ద 11 ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి మలుపు వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:11 AM