Share News

బీఎన్‌ రోడ్డులో ప్రయాణమంటే దుమ్ము దుమారం!

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:11 PM

మండలంలోని మేడివాడ నుంచి రావికమతం వరకు బీఎన్‌ రోడ్డులో ప్రయాణమంటే వాహనచోదకులు హడలిపోతున్నారు.

బీఎన్‌ రోడ్డులో ప్రయాణమంటే దుమ్ము దుమారం!
బీఎన్‌ రోడ్డు గర్నికం వద్ద వాహనాల రాకపోకలతో రేగిన దుమ్ము

గోతులను క్వారీ బుగ్గితో పూడ్చడంతో ఇబ్బందులు

భారీ వాహనాల రాకపోకల సమయంలో రేగుతున్న దుమ్ము

ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులకు తప్పని అవస్థలు

రావికమతం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మేడివాడ నుంచి రావికమతం వరకు బీఎన్‌ రోడ్డులో ప్రయాణమంటే వాహనచోదకులు హడలిపోతున్నారు. భారీ వాహనాల రాకపోకల సమయంలో రోడ్డుపై దుమ్ము ఎగసి పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ మార్గంలో చెరువును తలపించేలా గోతులు ఉండేవి. వాహనాల రాకపోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇటీవల క్వారీ బుగ్గితో గోతులను పూడ్చడంతో ఇప్పుడీ సమస్య ఎదురైంది.

గతంలో మండల పరిధిలోని బీఎన్‌ రోడ్డు పెద్ద పెద్ద గోతులతో దారుణంగా ఉండేది. దీంతో భారీ వాహనాలు సైతం ప్రమాదాలకు గురయ్యేవి. దీంతో ఇటీవల మేడివాడ నుంచి రావికమతం వరకు గోతులను క్వారీ బుగ్గితో పూడ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఈ మార్గంలో వాహనాలు రాకపోకలు సాగించేటప్పుడు దుమ్ము రేగుతోంది. దీంతో ద్విచక్ర వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాస్తవానికి చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి రోలుగుంట మండలం వెలంకాయలపాలెం వరకు కాంట్రాక్టర్‌ బీఎన్‌ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:11 PM