ఘాట్‌లో ప్రయాణమంటే టెన్షన్
ABN , Publish Date - Jun 22 , 2026 | 10:56 PM
పాడేరు ఘాట్‌లో నిత్యం భారీ వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఆగిపోతుండడంతో ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఆది, సోమవారాలు సైతం స్థానిక ఘాట్‌లో పలు మలుపుల వద్ద భారీ వాహనాలు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో గంటల తరబడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
మలుపుల్లో తరచూ ఆగిపోతున్న భారీ వాహనాలు
సోమవారం ఏనుగు పనుకు మలుపు వద్ద లారీ ఆగిపోవడంతో స్తంభించిన ట్రాఫిక్
రెండు గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు
ఆదివారం కూడా ఇదే పరిస్థితి
ప్రయాణికులకు తప్పని అవస్థలు
పట్టించుకోని రవాణా, పోలీస్ శాఖలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు ఘాట్‌లో నిత్యం భారీ వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఆగిపోతుండడంతో ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఆది, సోమవారాలు సైతం స్థానిక ఘాట్‌లో పలు మలుపుల వద్ద భారీ వాహనాలు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో గంటల తరబడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘాట్‌లో భారీ వాహనాల రాకపోకలతో పడుతున్న అవస్థలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
ఘాట్‌లోని రాజాపురం గ్రామానికి సమీపంలో సోమవారం ఉదయం ఏనుగుపనుకు మలుపు వద్ద భారీ లోడుతో వెళుతున్న లారీ అర్ధంతరంగా నిలిచిపోయింది. దీంతో బైకులు మినహా ఆటోలు, కార్లు, జీపులు, వ్యాన్లు, లారీలు, బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు రెండు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అలాగే ఆదివారం సాయంత్రం సైతం ఓ మలుపు వద్ద భారీ కంటైనర్ ఆగిపోవడంతో సుమారు రెండు గంటలు ట్రాఫిక్ స్తంభించింది. మలుపుల వద్ద భారీ వాహనాలు తిరగలేకపోవడం, లేదా ఎగువకు ఎక్కలేని పరిస్థితిలో మలుపులో ఆగిపోవడం వంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. గతంలో ఘాట్‌లో కొండచరియలు, చెట్టుకొమ్మలో విరిగిపడతాయని డ్రైవర్లు, ప్రయాణికులు భయపడేవారు. కానీ ఇటీవల కాలంలో భారీ వాహనాలు ఎక్కడ ఆగిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే ఘాట్ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 25 కిలోమీటర్లు ఘాట్ మార్గమే. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. అలాగే పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంతో పోలిస్తే వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో స్థానిక ఘాట్ మార్గంలో నిత్యం వాహనాలతో రద్దీగానే ఉంటుంది. ఈ తరుణంలో గంటల సమయం రాకపోకలకు అంతరాయం ఏర్పడినా అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి.
నిబంధనలు పాటించని భారీ వాహనాలు
స్థానిక ఘాట్‌లో భారీ వాహనాలు రాకపోకలు సాగించకూడదనే నిబంధనలు మచ్చుకైనా అమలు కావడం లేదు. గతంలో సిమెంట్ రేకులు, సిమెంట్ బస్తాలతో వచ్చే వాహనాలను గరికబంద జీసీసీ చెక్‌గేటు వద్ద నిలిపివేసి అక్కడ నుంచి ఆయా సరుకులను మినీ వ్యాన్లలో లోడ్ చేసి ఘాట్ మీదుగా ఏజెన్సీకి తరలించేవారు. అయితే గత నాలుగేళ్లుగా అలా చేయకుండా ఆయా సరుకులతో ఉన్న భారీ లారీలు సైతం ఘాట్‌లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా లారీలు మరమ్మతులకు గురై మలుపుల వద్ద ఆగిపోతున్న సందర్భాల్లో ఇతర వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అలాగే ఆయా లారీలు సైతం మోటారు చట్టాల నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్‌తో ఘాట్‌లోని రాకపోకలు సాగించే క్రమంలో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే దీనిపై రవాణా, పోలీసు అధికారులు కనీసం దృష్టిసారించకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.