Share News

వంతెనపై ప్రయాణమంటే హడల్‌

ABN , Publish Date - May 31 , 2026 | 12:31 AM

అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న కాలేజీ వంతెన ప్రమాదకరంగా ఉంది. అడుగడుగునా గోతులతో, వంతెన శ్లాబ్‌ ఊచలు పైకి లేచి అధ్వానంగా ఉంది. దీంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

వంతెనపై ప్రయాణమంటే హడల్‌
కొత్తూరు కాలేజీ బ్రిడ్జిపై ఏర్పడిన పెద్ద గొయ్యి

- ప్రమాదకరంగా కొత్తూరు కాలేజీ బ్రిడ్జి

- అడుగడుగునా గోతులు, పైకి లేచిన శ్లాబ్‌ ఊచలు

- ఫుట్‌పాత్‌లు దెబ్బతినడంతో పాదచారుల అవస్థలు

- ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి

కొత్తూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న కాలేజీ వంతెన ప్రమాదకరంగా ఉంది. అడుగడుగునా గోతులతో, వంతెన శ్లాబ్‌ ఊచలు పైకి లేచి అధ్వానంగా ఉంది. దీంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

కేబీ రోడ్డు గుండా సుమారు 32 గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే కాలేజీ బ్రిడ్జి కూడలిలో పెద్ద గోతులు ఉండడంతో భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఈ గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నాయి. అంతేకాకుండా బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లు దెబ్బతిని పాదచారులు నడిచేందుకు వీలు లేకుండా ఉంది. ఫుట్‌పాత్‌ పలకలు విరిగిపోవడంతో అందులో పిచ్చిమొక్కలు మొలిచాయి. బ్రిడ్జికి మధ్యలో శ్లాబ్‌ ఊచలు పైకి లేచి ఉండడంతో వాహనాలకు పంక్చర్లు అవుతున్నాయి. సుమారు ఏడాదిన్నర నుంచి ఇదే పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేయకపోవడం దారుణమని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వంతెనకు మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 31 , 2026 | 12:31 AM