తీరనున్న రవాణా కష్టాలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:14 AM
ఎట్టకేలకు మండలంలోని బొర్రా గేటువలస నుంచి కోనాపురం వరకు రోడ్డు పనులు ప్రారంభమ య్యాయి. దీంతో పలు గ్రామాలకు రవాణా కష్టాలు తీరతాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు గేటువలస- కోనాపురం రోడ్డు పనులు ప్రారంభం
కూటమి ప్రభుత్వంలో నెరవేరనున్న గిరిజనుల కల
అనంతగిరి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు మండలంలోని బొర్రా గేటువలస నుంచి కోనాపురం వరకు రోడ్డు పనులు ప్రారంభమ య్యాయి. దీంతో పలు గ్రామాలకు రవాణా కష్టాలు తీరతాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనంతగిరి, అరకులోయ మండలాల సరిహద్దు గ్రామాలను కలుపుతూ 15 ఏళ్ల క్రితం బొర్రా నుంచి కోనాపురం మీదుగా లోతేరు, ఇరగాయి వరకు రోడ్డును నిర్మించారు. సుమారు 20 గ్రామాల గిరిజనులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డు వర్షాల కారణంగా గోతులమయమైంది. గత వైసీపీ ప్రభుత్వం దీనిని కనీసం పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్‌శాఖ ప్రాజెక్ట్సు విభాగం పర్యవేక్షణలో బొర్రా గేటువలస నుంచి కోనాపురం వరకు 5.5 కిలో మీటర్ల రోడ్డు పునర్నిర్మాణానికి రూ.4 కోట్లు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మంజూరు చేసింది. అయితే పరిపాలన ఆమోదం తెలిపిన తరువాత టెండర్ ప్రక్రియలో సాంకేతిక సమస్య కారణంగా కొంతవరకు జాప్యం జరిగింది. కాగా ఈ వారంలో పనులు ప్రారంభం కావడంతో 20 గ్రామాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో మరిన్ని రోడ్ల నిర్మాణం ప్రారంభం
బగ్మారవలస జంక్షన్ నుంచి టోకూరు వరకు కిలో మీటరు మేర రోడ్డు పనులకు రూ.75 లక్షలు, పులుసుమామిడి-లుంగపర్తి వరకు 1.8 కిలో మీటర్లకు రూ.95 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలో ఈ రహదారుల పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.