ఏవోబీ ప్రజలకు తీరనున్న రవాణ కష్టాలు
ABN , Publish Date - Jun 19 , 2026 | 10:33 PM
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండ ప్రాంత ప్రజలకు రవాణ కష్టాలు తీరనున్నాయి. అత్యంత అధ్వానంగా తయారైన రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల బలోపేత ప్రాజెక్టు (ఏపీఆర్‌ఎఆర్‌ఎస్‌పీ) నిధులు రూ.7.6 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీరాజ్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండు నెలల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రోడ్డు నిర్మాణానికి రూ.7.6 కోట్లు విడుదల
టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన పీఆర్
రెండు నెలల్లో పనులు ప్రారంభం
చింతపల్లి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బలపం, కుడుముసారి, తమ్మంగుల పంచాయతీలకు చెందిన 89 గ్రామాల ఆదివాసీలు రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధిలో మూడు పంచాయతీ ప్రజలు కూడా ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. లోతుగెడ్డ బ్రిడ్జీ నుంచి రాళ్లగెడ్డకు వరకు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రహదారిని పదేళ్ల క్రితం నిర్మించారు. ఐదేళ్ల క్రితం చిన్నపాటి గోతులు ఏర్పడ్డాయి. సకాలంలో వైసీపీ ప్రభుత్వ పాలకులు గోతులను పూడ్చకపోవడంతో ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితికి చేరుకున్నది. రోడ్డు సమస్యపై ప్రాంతీయ ఉద్యోగులు, ఆదివాసీలు పలుమార్లు అధికారులకు, వైసీపీ పాలకులకు అర్జీలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అడుగడుగున భారీ గోతులు ఏర్పడ్డాయి. వర్షాలకు గోతులన్నీ వర్షపు నీరుతో చెరువులను తలపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సు, సర్వీసు జీపులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు అతికష్టంపై రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. సర్వీసు ఆటోలు, జీపులు రెండు రోజులు ఈమార్గంపై ప్రయాణిస్తే మరమ్మతులకు గురవుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు.
నిధులు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారి దుస్థితి, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి 2025 జూన్‌లో తీసుకు వెళ్లారు. సీఎం ఆదేశాలతో పంచాయతీరాజ్ ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి 2026 జనవరిలో ప్రభుత్వానికి పంపించారు. రహదారి పూర్తిగా పాడైపోవడంతో 9 కిలోమీటర్లు నూతన రహదారి నిర్మాణానికి ఈ ఏడాది మే నెలాఖరున రూ.7.6 కోట్లు మంజూరు చేసింది. దీంతో పంచాయతీరాజ్ ప్రాజెక్టు అధికారులు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. మరో రెండు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పీఆర్ ప్రాజెక్టు ఏఈఈ వెంకటేశ్ తెలిపారు.